152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి..దీనిపైనే మహారాష్ట్రను ఒప్పించేలా మాట్లాడండి : ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌రెడ్డి

152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి..దీనిపైనే మహారాష్ట్రను ఒప్పించేలా మాట్లాడండి : ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌రెడ్డి
  •     అధికారులకు మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌రెడ్డి ఆదేశాలు​
  •     గ్రావిటీ ద్వారానే 80 టీఎంసీల నీటిని సుందిళ్లకు తీస్కపోవచ్చు
  •     1975, 1978 అంతర్రాష్ట్ర ప్రాణహితపై ప్రాజెక్టులు కట్టుకునే హక్కుందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా మహారాష్ట్ర, కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆదేశించారు. సెప్టెంబర్​ 1న ఢిల్లీలో సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) చైర్మన్​ నేతృత్వంలో మహారాష్ట్రతో సమావేశం జరగనున్న నేపథ్యంలో.. శనివారం సెక్రటేరియెట్‌‌లో అధికారులతో మంత్రి ఉత్తమ్‌‌ రివ్యూ చేశారు. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించి.. గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల జలాలను సుందిళ్లకు తరలించొచ్చన్నారు. 

దీనివల్ల లిఫ్టుల ఖర్చు, కరెంట్ బిల్లుల భారం తప్పడమే కాకుండా రైతులకు సాగునీరు అందుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ నిరంతరం జరిపిన సంప్రదింపులు, లేఖల ఫలితంగానే కేంద్రం ఈ చర్చలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. 2016లో నాటి బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంలో బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు తగ్గించి రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం చేసిందని ఉత్తమ్​ అన్నారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అధ్యయనం ప్రకారం.. 148 మీటర్ల వద్ద 1,150 ఎకరాలు, 152 మీటర్ల వద్ద 2,500 ఎకరాల మహారాష్ట్ర భూభాగం ముంపునకు గురవుతుందన్నారు. ‘‘ఎలాగూ రెండు స్థాయిల్లోనూ ముంపు ఉంటుంది. 

అలాంటప్పుడు సమర్థవంతంగా చర్చలు జరిపి 152 మీటర్లకే మహారాష్ట్రను ఒప్పించి ఉండాల్సింది. కానీ, బీఆర్‌‌ఎస్ సర్కారు చేతులెత్తేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది’’ అని ఆయన ఫైర్​ అయ్యారు. కాళేశ్వరమంటూ ప్రాజెక్ట్‌‌ను రీడిజైనింగ్​ చేయడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. 

ప్రాజెక్టు చివరి ఆయకట్టు అయిన ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని కీలక ప్యాకేజీలను రద్దు చేసి ఆ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. కాగా, 1975, 1978 అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం ప్రాణహిత నదిపై స్వతంత్రంగా లేదా సంయుక్తంగా ప్రాజెక్టులను నిర్మించుకునే చట్టబద్ధమైన హక్కు తెలంగాణకు ఉందని ఉత్తమ్​ గుర్తుచేశారు. సెప్టెంబర్ 1న జరిగే సమావేశంలో బ్యారేజీ ఎత్తు, ముంపు తీవ్రత, సాంకేతిక సాధ్యాసాధ్యాలపై మహారాష్ట్రతో సానుకూల వాతావరణంలో చర్చిస్తామని, తెలంగాణ న్యాయమైన వాటాను, హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడి తీరుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్​ సెక్రటరీ ఈ శ్రీధర్, ఈఎన్సీ (జనరల్)  రమేశ్​ బాబు, జాయింట్​ సెక్రటరీ కే శ్రీనివాస్ పాల్గొన్నారు.