మేడిగడ్డపై ఎన్​డీఎస్ఏ నివేదిక తెప్పించండి

మేడిగడ్డపై ఎన్​డీఎస్ఏ నివేదిక తెప్పించండి
  • సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌పై చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్​తో ఒప్పందం చేసుకోవాలి
  • ఇరిగేషన్​ ఆఫీసర్లతో మంత్రి ఉత్తమ్​ సమీక్ష
  • వానాకాలంలో అవసరమైన టెస్టులు చేయండి: మంత్రి ఉత్తమ్​

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌డీఎస్‌‌ఏ) తుది నివేదికను వీలైనంత త్వరగా తెప్పించాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆదేశించారు. వానాకాలంలో నిర్వహించాల్సిన టెస్టులు పూర్తిచేసి, అంతిమ నివేదికను ఎన్‌‌డీఎస్‌‌ఏ నిపుణుల కమిటీకి సమర్పించాలని సూచించారు. బుధవారం జలసౌధలో ఎన్‌‌డీఎస్‌‌ఏ అందించాల్సిన తుది నివేదికతోపాటు సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్‌‌కు చత్తీస్‌‌గఢ్​ నుంచి రావాల్సిన అనుమతులు, ముంపునకు గురైన సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ నష్టపరిహారం విషయంలో‌‌ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు, తదితర అంశాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్​ మాట్లాడుతూ.. సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ కు చత్తీస్‌‌గఢ్​ నుంచి పొందాల్సిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆ ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర జలవనరుల సంఘం లేవనెత్తిన అంశాలపై త్వరగా కార్యాచరణ పూర్తి చేయాలన్నారు. చత్తీస్​గఢ్​లో ముంపునకు గురైన సమ్మక్క సాగర్‌‌కు నష్టపరిహారం విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో  సంప్రదింపులు జరపాలని అన్నారు. 

కొత్త ప్రాజెక్టుల భూ సేకరణ పూర్తి చెయ్యండి

ఆరు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణను 2025 మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆదేశించారు. డ్యామ్‌‌లు, కాలువల భద్రతకు అవసరమైన 1,800 మంది లష్కర్ల నియామకాలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పందిస్తూ .. ఆ ప్రక్రియను పూర్తి చేశామని, ఆర్థిక శాఖ అనుమతులు పొందాల్సి ఉందని వివరించారు. దీంతో అక్కడే ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావుతో మంత్రి మాట్లాడారు. వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖకు ప్రజాప్రతినిధులు పంపిన విజ్ఞప్తులపై వెంటనే స్పందించి, సకాలంలో జవాబు ఇవ్వాలని సూచించారు.

డ్యామ్​లు, కాలువలభద్రతను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించం

డ్యామ్​లు, కాలువల భద్రతను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి ఉత్తమ్​హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు  భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన అంశాలను చూసుకునేందుకు  ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించారు. వినయ్ కృష్ణారెడ్డికి కమిషనర్‌‌గా బాధ్యతలు అప్పగించారు.