70 స్థానాల్లో గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

70 స్థానాల్లో గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • 70 స్థానాల్లో గెలుస్తాం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని, 70 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. శుక్రవారం తన భార్య పద్మావతితో కలిసి గాంధీ భవన్​లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు అందజేశారు. తర్వాత ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. కుటుంబ పార్టీ వాళ్లు ఇంట్లో కూర్చోవాల్సిందే అని విమర్శించారు. ‘‘దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అంటూ కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. తలసరి అప్పుల్లో, లిక్కర్ అమ్మకాల్లో, అవినీతిలో రాష్ట్రం నంబర్ వన్​లో ఉంది. ఒక్కొక్కరిపై సగటున రూ.1.20 లక్షల అప్పు ఉంది. తెలంగాణ ఏర్పడే నాటికి అప్పు రూ.69 వేల కోట్లు. ఇప్పుడు రూ.4 లక్షల కోట్లకు పెరిగాయి’’ అని ఉత్తమ్ మండిపడ్డారు. 

119 సెగ్మెంట్లను ముక్కలు చేసి పంచుకున్నరు

రాష్ట్రాన్ని కేసీఆర్ తన సామ్రాజ్యంలా ఫీల్ అవుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. 119 నియోజకవర్గాలను కేసీఆర్ ఫ్యామిలీ ముక్కలు చేసి పంచుకుని దోపిడీ చేస్తున్నదని ఆరోపించారు. పోలీసుల సాయంతో అరాచకాలు చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలను హింసిస్తున్నారని ఫైర్ అయ్యారు. అన్ని వర్గాల ను సీఎం మోసం చేశారన్నారు. బీసీల్లోని కొన్ని కులాలకు టికెట్లు ఇవ్వలేదని, ముస్లింలకు 12% రిజర్వేషన్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. కమ్యూనిస్టులను కేసీఆర్ మోసం చేస్తారని తాను ముందే ఊహించానన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు స్థానాల్లోంచి పోటీ చేస్తున్నారని విమర్శించారు.