- పెద్దగా రియాక్షన్స్ లేవని అధికారుల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఊపందుకుంది. సెకండ్ ఫేజ్ లో సోమవారం నుంచి ఆదివారం వరకు సుమారు లక్ష మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎవరికీ మేజర్ రియాక్షన్స్ రాలేదని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. కొవిషీల్డ్ వేయించుకున్న ప్రతి 14 వేల మందిలో ఒకరికి, కొవాగ్జిన్ వేసుకున్న ప్రతి 20 వేల మందిలో ఒకరికి రియాక్షన్ వస్తున్నట్టు తెలిపారు. ఆ రియాక్షన్స్ కూడా నార్మల్ మెడిసిన్‌తోనే తగ్గిపోతున్నాయని అన్నారు. ఎక్కువ మంది ప్రజలు కొవిషీల్డ్ కంటే కొవాగ్జిన్ వేయించుకునేందుకు ఇష్టపడుతున్నారని తెలిపారు. ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు
కొవాగ్జిన్ వేసుకున్నట్టు జరిగిన ప్రచారంతో.. దీనిపై జనాల్లో నమ్మకం పెరిగిందని అంటున్నారు.
3 లక్షలకు చేరువలో కేసులు..
రాష్ర్టంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. శనివారం నమోదైన 158 కేసులతో కలిపి, మొత్తం బాధితుల సంఖ్య 2,99,900కు చేరుకున్నట్టు హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆదివారం ప్రకటించింది. ఇందులో 2,96,373 మంది కోలుకున్నారని తెలిపింది. 748 మంది హోమ్ ఐసోలేషన్‌లో, 1,138 మంది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. కరోనాతో శనివారం మరొకరు చనిపోవడంతో, మృతుల సంఖ్య 1,641కి పెరిగినట్టు పేర్కొంది.
