V6 News

రెండేండ్ల  కష్టానికి ఫలితమిది... విమెన్స్ క్యాండిడేట్స్‌‌ చెస్ టైటిల్ విన్నర్ వైశాలి

రెండేండ్ల  కష్టానికి ఫలితమిది... విమెన్స్ క్యాండిడేట్స్‌‌ చెస్ టైటిల్ విన్నర్ వైశాలి

న్యూఢిల్లీ: విమెన్స్‌‌ క్యాండిడేట్స్ చెస్ టైటిల్ నెగ్గడం తన కెరీర్‌‌లోనే అత్యంత అపురూపమైన విజయమని ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి ఆనందం వ్యక్తం చేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం తాను రెండేండ్లుగా పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, టైటిల్ గెలిచిన క్షణం ఒక డ్రీమ్ మూమెంట్‌‌లా అనిపించిందని పేర్కొంది. బుధవారం జరిగిన ఆఖరి రౌండ్‌‌లో రష్యాకు చెందిన కేథరినా లాగ్నోపై గెలిచి, క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గిన ఇండియా తొలి మహిళగా వైశాలి చరిత్ర సృష్టించింది. 

టోర్నీ మధ్యలో చైనా స్టార్ జూ జినెర్ చేతిలో ఓడిపోవడం తనపై ఒత్తిడిని తగ్గించిందని వైశాలి ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. ‘జూ జినెర్‌‌తో మ్యాచ్‌‌కు ముందు ఒక పాయింట్ ఆధిక్యంలో ఉండటం నాపై కొంత ఒత్తిడి పెంచింది. కానీ ఆ మ్యాచ్‌‌లో ఓడిపోయాక పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది. అప్పుడు పాయింట్ల పట్టిక కంటే నా నియంత్రణలో ఉన్న నా ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. చివరి రెండు రోజులు పూర్తి ఏకాగ్రతతో ఆడటంతో విజయం దక్కింది’ అని వివరించింది.

కొండంత అండగా అమ్మ, తమ్ముడు

ఈ చారిత్రక ప్రయాణంలో కుటుంబం అందించిన మద్దతు వెలకట్టలేనిదని వైశాలి చెప్పింది. ముఖ్యంగా తల్లి నాగలక్ష్మి, తమ్ముడు ప్రజ్ఞానంద తనతో పాటు సైప్రస్‌‌లో ఉండటం కొండంత బలాన్ని ఇచ్చిందని వెల్లడించింది. ‘ఒక ప్లేయర్‌‌‌‌కు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. ముఖ్యంగా భావోద్వేగాలతో కూడిన ఇలాంటి సుదీర్ఘమైన టోర్నీల్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. నా వెంటే ఉండి నన్ను సపోర్ట్ చేస్తున్న అమ్మ, ప్రాగ్‌‌ (ప్రజ్ఞా)ను చూస్తుంటే నేను చాలా లక్కీ అనిపిస్తుంది’ అని పేర్కొంది.