- పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు స్పీడప్ చేయండి
- అధికారులకు మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశం
మక్తల్, వెలుగు: సాగునీరు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం, కల్వాల - సీపూర్ రోడ్డు కమ్ బ్రిడ్జ్ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. మక్తల్ మండలం కాట్రెవుపల్లి వద్ద రూ. 4,750 కోట్లతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పంప్ హౌస్, కెనాల్ పనులను పర్యవేక్షించారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేసి మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం నర్వ మండలంలోని కల్వాల - సీపూర్ గ్రామాల మధ్య రూ. 6.40 కోట్లతో చేపట్టిన బ్రిడ్జ్ పనులను తనిఖీ చేశారు. రాబోయే వర్షాకాలం లోపే ఈ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడొద్దని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక రైతుల సాగునీటి కష్టాలు, ప్రజల రవాణా ఇబ్బందులు శాశ్వతంగా తొలిగిపోతాయన్నారు. మంత్రి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఉన్నారు.
