నల్గొండ/వనపర్తి/రామాయంపేట/కొండపాక/అమ్రాబాద్/కొల్లాపూర్, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు, మానవ మనుగడకు మూలమైన మొక్కలను నాటి సంరక్షించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. వనమహోత్సవంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట అడవిలో కేంద్ర ప్రభుత్వ నగర వన యోజన కింద నిర్మించిన అర్బన్ పార్క్ ను మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు.
ఎంపీ మాట్లాడుతూ హైవేల మీద రాకపోకలు సాగించే ప్రయాణికులు, వాహనదారులు సేద తీరేందుకు, పట్టణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నగర వన యోజన కింద అర్బన్ పార్క్ లను అభివృద్ది చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రారంభించిన 11 పార్కులకు కేంద్రం రూ.22 కోట్లు మంజూరు చేసిందన్నారు. హైవే765 డీజీ రోడ్డులో మొదటి దశ కింద జూలైలో 20 వేల మొక్కలు నాటేందుకు జూలైలో ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
అమ్రాబాద్‌లో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని కోరారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి మొక్కలు నాటగా, ఈ ఏడాది జిల్లాలో 57.70 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
వనపర్తి ఎకో పార్క్ లో రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి వనమహోత్సవాన్ని ప్రారంభించారు. ప్రస్తుత 24 శాతం అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా మర్పడగ తేజోవనం అర్బన్ పార్క్ లో కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్ మొక్కలు నాటారు. కొల్లాపూర్ రేంజ్ అటవీ ప్రాంతంలో మొల్ల చింతపల్లి అటవీ సమీపంలో నాగర్కర్రూల్ జిల్లా అటవీ అధికారి దేవత్ చంద్ర హాజరై వనమహోత్సవాన్ని ప్రారభించారు.
