కరెంట్ షాక్తో ఇద్దరు మృతి..వనపర్తి జిల్లాలో ఘటన

కరెంట్ షాక్తో ఇద్దరు మృతి..వనపర్తి జిల్లాలో ఘటన

ఖిల్లాగణపురం, వెలుగు: వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు కరెంట్​ షాక్​తో చనిపోయారు. ఎస్సై వెంకటేశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జోగు మహేశ్(22) శనివారం సాయంత్రం ఇంటి గోడలకు నీళ్లు పట్టేందుకు మోటార్  స్టార్ట్  చేయగా ప్రమాదవశాత్తు విద్యుత్  వైరు తగిలి కింద పడిపోయాడు. అతడిని మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మహబూబ్ నగర్  జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించగా అప్పటికే చనిపోయాడు.

మృతుడి తండ్రి జోగు బక్కన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆముదంబండ తండాకు చెందిన కేతావత్  బాల్య నాయక్(30) ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం తన ఆటోను కడిగిన తర్వాత మోటార్ కు ఉన్న వైర్  చుడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్​ వైర్​ తగిలి స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు మహబూబ్​నగర్  ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.