యాదగిరిగుట్ట, వెలుగు : వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని, సమృద్ధిగా వానలు కురిసి పాడిపంటలతో రైతాంగం సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో చేపట్టిన వర్ష పాశుపత వరుణ యాగం గురువారం పూర్ణాహుతితో ముగిసింది.
చివరి రోజున యాగంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ, విప్ బీర్ల అయిలయ్యకు అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు.
అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో భవానీ శంకర్ లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు.
