విజయ్ ఇంటికి వీసీకే చీఫ్.. తమిళనాడు డిప్యూటీ సీఎం పోస్ట్ ఆయనకేనా..?

విజయ్ ఇంటికి వీసీకే చీఫ్.. తమిళనాడు డిప్యూటీ సీఎం పోస్ట్ ఆయనకేనా..?

చెన్నై: విజయ్ టీవీకే పార్టీకి సంఖ్యా బలం పెరిగింది. టీవీకేకు బయట నుంచి మద్దతు తెలపాలని సీపీఐ నిర్ణయించింది. ఈ మేరకు.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలుపుతున్నామని సీపీఐ అధికారికంగా లేఖ కూడా విడుదల చేసింది. సీపీఎం, వీసీకే పార్టీలు కూడా విజయ్ పార్టీకి మద్దతు తెలిపాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ విజయ్ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. 

ఈ క్రమంలో.. వీసీకే పార్టీ మద్దతు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. వీసీకే పార్టీ చీఫ్కు విజయ్ పార్టీ నుంచి ఒక బంపర్ ఆఫర్ దక్కినట్లు తమిళ మీడియాలో వార్తలొచ్చాయి. అదేంటంటే.. టీవీకే ప్రభుత్వానికి వీసీకే పార్టీ మద్దతు తెలిపితే.. విజయ్ రాజీనామా చేసే తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ వీసీకే అధినేతకు కేటాయించడానికి టీవీకే ముందుకొచ్చినట్లు తెలిసింది.

అంతేకాదు.. ఈ స్థానంలో వీసీకే అధినేత తిరుమావళవన్ గెలిస్తే.. తమిళనాడు డిప్యూటీ సీఎం పదవిని ఆయనకు టీవీకే ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అసెంబ్లీలో వీసీకేకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వామపక్ష పార్టీలకు నలుగురు శాసనసభ్యులు ఉన్నారు. విజయ్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ మూడు పార్టీలు మద్దతు తెలిపితే విజయ్ సీఎం కావడం ఖాయం. సీపీఐ ఇప్పటికే అధికారికంగా మద్దతు ప్రకటించింది. సీపీఎం, వీసీకే కూడా మద్దతు తెలిపినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటికైతే ఈ రెండు పార్టీలు అధికారికంగా టీవీకేకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించకపోవడం గమనార్హం.

టీవీకే 107, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2.. ఇలా అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 118 ఎమ్మెల్యేల బలంతో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కలవాలని టీవీకే అధినేత విజయ్ నిర్ణయించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. తమిళనాడు గవర్నర్ అర్లేకర్ను విజయ్ కలిసేందుకు వెళ్లడం ఇది మూడోసారి కావడం గమనార్హం.