పెట్రో దెబ్బకు భారీగా పెరిగిన కూరగాయల ధరలు

పెట్రో దెబ్బకు భారీగా పెరిగిన కూరగాయల ధరలు

రోజు రోజుకి పెట్రో ధరలు పెరగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర వందకు చేరువైంది. చమురు ధరలు పెరగడంతో.. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ కూరగాయ కొనాలన్నా ధరలు మండిపోతున్నాయి. నిన్నా మొన్నటి దాకా అందుబాటు ధరలకు లభించిన  ఆకు కూరల రేట్లు కూడా ఒక్కసారిగా పెరిగాయి. దాంతో ఏది కొనాలన్నా సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 

కూరగాయల రేట్లు పోటీపడుతూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ టమాటా కంటే, ఒక క్యాల్లి ఫ్లవర్ రేటే ఎక్కువ. ఉల్లి పాయ కంటే ఉల్లి పొరక ఘాటు పుట్టిస్తోంది. తక్కువ రేటు ఉండే బీర, కాకర కూడా పచ్చి మిర్చి ధరలతో పోటీపడుతున్నాయి. రెండు వారాల క్రితం బీన్స్, చిక్కుడు తప్ప అన్ని కూరగాయలు కేజీ 25 రూపాయలలోపే ఉండేవి. టమాటా అయితే కేజీ ఏడు రూపాయలే పలికింది. వంకాయ, దొండకాయ కేజీ 15 రూపాయలు వరకు ఉన్నాయి. కానీ ఇప్పుడు టమాటా, వంకాయ తప్ప అన్ని కూరగాయల రేట్లూ పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో క్యారెట్ కేజీ 50 రూపాయలు, పచ్చి మిర్చి కేజీ 35 రూపాయల దాకా పలుకుతున్నాయి. బీరకాయలు 55 రూపాయలు, క్యాప్సికం 50, బీన్స్ 110, ఉల్లి పొరక 160, బెండకాయ కేజీ 45 రూపాయిలుగా ఉన్నాయి. ఇలా అన్ని కూరగాయల రేట్లు గత రెండు వారాలుగా పెరుగుతూ ఉన్నాయి. కాగా.. బయట మార్కెట్‌తో పోలిస్తే రైతు బజార్‌లో ఇవన్నీ 10, 15 రూపాయల తక్కువ ధరకు లభిస్తున్నాయి. 

కాగా.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయనీ... దాంతో ఇబ్బందులు పడుతున్నామని జనాలు వాపోతున్నారు. ఒక పక్క రేట్లు పెరుగుతున్నాయని వినియోగదారులు మొత్తుకుంటుంటే.. మరోపక్క తమ పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 

వర్షాలు పడుతున్న టైమ్ కావడంతో ఇప్పుడు అన్ని కూరగాయల రేట్లు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో వానలు పడ్డాక తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరో నెల వరకు కూరగాయల రేట్లు ఇలాగే ఉంటాయంటున్నారు.