కూరగాయలు కొనేందుకు జనాలు రావట్లేదు

కూరగాయలు కొనేందుకు జనాలు రావట్లేదు

హైదరాబాద్: జోరున  కురుస్తున్న వర్షాలతో  ఆకుకూరలు,  కూర గాయలు పాడవుతున్నాయి. ముసుర్లు  పడుతుండటంతో  తోటల్లోని కూరగాయలు కోసేందుకు  వీలు లేకుండా పోయింది.  దాంతో హైదరాబాద్  నగర మార్కెట్లకు  వచ్చే కూరగాయలపై  తీవ్ర ప్రభావం పడింది.  ఇలాగే  ఇంకొన్ని రోజులు వర్షం పడితే  సప్లయ్ తగ్గి ...రేట్లు పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

60 శాతం కూరగాయలే వస్తున్నయ్...

వర్షాలతో ప్రతి రోజూ వచ్చే కూరగాయల కన్నా 40 శాతం తక్కువగా వస్తున్నాయి. తోటలు, పొలాల్లో కూరగాయల పంటలన్నీ నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు కోసేందుకు కూలీలు రావట్లేదు. దాంతో హైదరాబాద్ లోని రైతు బజార్లకు వచ్చే కూరగాయల సప్లయ్ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. 

జనాలు రావడం లేదు....

ఆన్ లైన్ మార్కెట్ వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో ఆకుకూరలు పాడవుతున్నాయని, పంటను తీసుకుని మార్కెట్ కు వస్తే జనాలు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ పోర్ట్ చార్జీలు కూడా రావట్లేదని వాపోతున్నారు. రైతు బజార్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. జనం ఎక్కువగా ఆన్ లైన్ స్టోర్స్ లో కొంటున్నారని  రైతులు చెబుతున్నారు. 

ప్రస్తుతం కూరగాయల రేట్లు ఇలా ఉన్నాయి...

ప్రస్తుతం ఎర్రగడ్డ రైతు బజార్లో టమాట కేజీ 20 రూపాయలు, వంకాయ 23, బెండకాయ 30, పచ్చి మిర్చి 45, క్యాప్సికం 50, బీరకాయ 35, క్యారెట్ 57 రూపాయలు... క్యాబేజీ 18, బీన్స్ 75 రూపాయల దాకా ఉన్నాయి. మార్కెట్లో కూరగాయల  రేట్లు ఎక్కువే ఉన్నాయని సిటీ జనం అంటున్నారు. వర్షాల వల్ల క్వాలిటీ సరిగా లేదని చెబుతున్నారు.