- విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయ పరిధిలోని కోడెలను అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, ఎవరైనా కోడెలను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. రాజన్నసిరిసిల్ల వేములవాడ పట్టణం తిప్పాపూర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో మంగళవారం రైతులకు కోడెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కోడెను కట్టే సంస్కృతి వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మాత్రమే ఉందన్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లిస్తారని వివరించారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులకు తిప్పాపూర్ గోశాల నుంచి ఉచితంగా కోడెలను పంపిణీ చేస్తున్నామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే కోడెలను పంపిణీ చేస్తున్నామన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాలకు చెందిన 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు అర్హులైన రైతులు మాత్రమే కోడెల స్వీకరణకు అర్హులన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పుల్కం రాజు, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, ఆర్డీవో రాధాబాయ్, ఆలయ ఇన్‌చార్జి ఈవో అంజనారెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, డీఏవో అఫ్జల్ బేగం, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్ కుమార్ పాల్గొన్నారు.
