గర్భగుడి పవిత్రతను దెబ్బతీశారంటూ వెంకయ్య కంటతడి

గర్భగుడి పవిత్రతను దెబ్బతీశారంటూ వెంకయ్య కంటతడి

న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం మధ్యాహ్నం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజాస్వామ్యానికి అత్యున్నత దేవాలయం లాంటి పార్లమెంటులో సభ్యుల తీరు పదే పదే గర్భగుడి పవిత్రతకు భంగం కలిగించేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షాలు రోజూ సభ కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవడాన్ని తప్పు పట్టారు. పార్లమెంటులో ప్రజల సమస్యలపై చర్చ జరపాలి, నిరసనలు తెలపాలే కానీ ఇష్టానుసారంగా సభను అడ్డుకోవడం తగదని హితవు చెప్పారు.

నిన్న సభలో జరిగిన దానికి రాత్రంతా నిద్ర పట్టలేదు

రోజూ ప్రతిపక్షాలు పెగాసస్, అగ్రి చట్టాలపై చర్చకు డిమాండ్ చేస్తూ సభను అడ్డుకుంటున్నాయి. పోడియం వద్దకు వచ్చి అపోజిషన్ ఎంపీలు నినాదాలు చేస్తూ, ఆందోళనకు దిగుతున్నారు. దీంతో సభ వాయిదాల పర్వంగానే సాగుతోంది. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌తో నిన్న (మంగళవారం) రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో అగ్రి చట్టాలు, రైతు సమస్యలపై చర్చకు అనుమతి ఇచ్చారు. దీనిపై డిబేట్ మొదలవ్వగానే కొందరు ప్రతిపక్ష నేతలు నినాదాలు చేస్తూ నేరుగా పోడియం దగ్గరకు దూసుకొచ్చారు. చైర్మన్ ముందు భాగంలో ఉండే సభ అధికారులు, సెక్రెటరీ జనరల్, ప్రైసైడింగ్ ఆఫీసర్, ఇతర సిబ్బంది కూర్చుని ఉండే బల్లపైకి ఎక్కి నినాదాలు చేశారు. చైర్మన్ వైపు పేపర్లు విసరడం లాంటి పనులు చేశారు. ఇవాళ (బుధవారం) ఉదయం సభ మొదలయ్యాక కూడా ఎంపీలు నిరసనలను మొదలు పెట్టారు.

దీంతో సభ్యులు సహనంతో ఉండాలని చైర్మన్ వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. సభ రోజూ ఇదే తీరుగా నడుస్తోందని, నిన్న మరీ శ్రుతిమించిపోయిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటు దేవాలయం లాంటిదని, మన దేశం గుడులు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు అని రకరకాల ప్రార్థనా స్థలాలతో నిండి ఉంటుందని, వాటిని ఎలా గౌరవిస్తారో పార్లమెంటునూ అలాగే గౌరవించాలని వెంకయ్య అన్నారు. కానీ నిన్న కొందరు ఎంపీలు ప్రవర్తించిన తీరు తనను తీవ్ర ఆవేదనకు, బాధకు లోను చేసిందన్నారు. సభ దేవాలయమైతే, చైర్మన్ ముందు ఉండే అధికారుల బల్లల దగ్గర నుంచి ఉండే ప్రాంతం గర్భగుడి లాంటిదని, దానికొక పవిత్రత ఉంటుందని, ఆ బల్లలు ఎక్కి నిల్చోవడం ద్వారా ఆ పవిత్రతకు భంగం కలిగించారని ఆయన భావోద్వేగభరితంగా అన్నారు. నిన్న జరిగిన తీరుకు తనను తీవ్రమైన బాధ, మనోవ్యధ కలిగాయని, ఈ ఆవేదనతో రాత్రంతా తనకు నిద్రపట్టలేదని చెబుతూ కుమిలిపోయారు. తీవ్ర భావోద్వేగంతో ఆ సమయంలో వెంకయ్య నాయుడి నోట మాట పెగల్లేదు. కంటతడి పెట్టుకున్న ఆయన సభలో సభ్యులు సమయమనం, సభ్యతతో వ్యవహరించాలని కోరారు. ఏదైనా అంశంలో వ్యతిరేకత  ఉంటే ప్రతిపక్షాలు సభలో చర్చ ద్వారా తమ అభ్యంతరాలను తెలియజేయొచ్చని, నిరసన వ్యక్తం చేయొచ్చని, ఓటింగ్‌ ద్వారా వ్యతిరేకించవచ్చని చెప్పారు. కానీ ప్రభుత్వం ఏం అది చేయాలి, ఇది చేయాలి అని బలవంతం చేయడం తగదని,  ప్రతిపక్షాలు నిన్న తమ అభిప్రాయాలను చెప్పే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారని వెంకయ్య అన్నారు.