టెర్రరిజం, పీవోకేపైనే చర్చలు.. ఏ దేశ మధ్యవర్తిత్వం అవసరం లేదు: వెంకయ్య నాయుడు

టెర్రరిజం, పీవోకేపైనే చర్చలు.. ఏ దేశ మధ్యవర్తిత్వం అవసరం లేదు: వెంకయ్య నాయుడు

హైదరాబాద్: పాక్, పీవోకేలోని టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసిన సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‎కు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో  దేశవ్యాప్తంగా తిరంగా విజయ యాత్ర చేపట్టాని బీజేపీ పిలుపునిచ్చింది. హై కమాండ్ పిలుపు మేరకు తెలంగాణ బీజేపీ యూనిట్ శనివారం (మే 17) హైదరాబాద్‎లో తిరంగా యాత్ర చేపట్టింది. 

ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి స్వామీ వివేకానంద స్టాట్య్చూ వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీకి హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మనది శాంతి కోరుకునే దేశమని.. భారత్ ఎప్పుడూ ఏ దేశం మీద ముందుగా దాడి చేయలేదని అన్నారు. పాక్‎తో ఉద్రిక్తతల వేళ ప్రధాని మోడీ ప్రదర్శించిన సమయస్పూర్తిని మెచ్చుకోవాలన్నారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లితే ప్రజలు కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా ఉండాలని కోరారు. 

►ALSO READ | కేటీఆర్ ఫారిన్ వెళ్లగానే.. బీఆర్ఎస్ ఎల్పీ చీలిక: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పొరుగు దేశం పాకిస్తాన్‎తో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నం చేశాం.. కానీ దాయాది దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ పై దాడులకు ఉసిగొల్పుతోందని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్‎తో చర్చ జరపాలి అంటే అది కేవలం ఆక్రమిత కశ్మీర్, ఉగ్రవాదంపైన మాత్రమే జరగాలన్నారు. కాశ్మీర్ అంశంలో భారత్‎కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు.