జేఈఈ మెయిన్​లోమనోడు టాప్.. నేషనల్ టాపర్​గా వెంకట్ కౌండిన్య 

జేఈఈ మెయిన్​లోమనోడు టాప్.. నేషనల్ టాపర్​గా వెంకట్ కౌండిన్య 
  • జేఈఈ మెయిన్​లోమనోడు టాప్
  • నేషనల్ టాపర్​గా నిలిచిన వెంకట్ కౌండిన్య 
  • టాప్ 10లో ఐదుగురు మన రాష్ట్రంవాళ్లే   
  • మొత్తం 43 మందికి వంద పర్సంటైల్
  • వీరిలో 11 మంది తెలంగాణ వాళ్లే 
  • నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్​డ్​కు రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్, వెలుగు:      ఐఐటీలు, జాతీయ ఇంజినీరింగ్​ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ సెషన్ 2 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ మెయిన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ప్రకటించింది. ఇందులో హైదరాబాద్​కు చెందిన సింగరాజు వెంకట్ కౌండిన్య 300 మార్కులకు 300 సాధించి నేషనల్ టాపర్​గా నిలిచాడు. జాతీయ స్థాయిలో మొత్తం 43 మందికి వంద పర్సంటైల్ రాగా.. వీరిలో మన రాష్ట్రం వాళ్లే 11 మంది ఉన్నారు.

జేఈఈ మెయిన్ 2లో టాప్ టెన్ లో నిలిచిన స్టూడెంట్లలోనూ తెలంగాణ నుంచి ఐదుగురు ఉన్నారు. వెంకట్ కౌండిన్యతోపాటు అల్లం సుజయ్, వావిలాల చిద్విలాస్ రెడ్డి, అభినవ్ చౌదరీ, అభినీత్ మాజేటి కూడా టాప్ టెన్లో ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఏపీకి చెందిన కల్లకూరి సాయినాథ్ శ్రీమంత్ 300 మార్కులు సాధించి, రెండో స్థానంలో నిలిచారు. కాగా, జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 15 వరకూ జరిగాయి. మొత్తం 9,31,510 మంది రిజిస్టర్ చేసుకుంటే.. 8,83,372 మంది అటెండ్ అయ్యారు.  

అడ్వాన్స్ డ్​కు 2,50,255 మంది 

జేఈఈ మెయిన్ 2 పరీక్షల ఫలితాలతో పాటు, జేఈఈ అడ్వాన్స్ డ్ కటాఫ్ ను కూడా ఎన్టీఏ శనివారం ప్రకటించింది. మెయిన్ నుంచి అడ్వాన్స్ డ్ కు 2,50,255 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అడ్వాన్స్ డ్ పరీక్ష రాసేందుకు వీరికి ఆదివారం నుంచి రిజిస్ర్టేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 7 వరకూ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఇచ్చారు. అడ్వాన్స్ డ్ పరీక్షను జూన్ 4వ తేదీన నిర్వహించనున్నారు.   

ముంబై ఐఐటీలో చేరాలనుంది  

జేఈఈ మెయిన్ లో టాపర్ గా నిలవడం సంతోషంగా ఉంది. ఇదే పట్టుదలతో అడ్వాన్స్ డ్ లోనూ ముందుకు పోతాను. అమ్మ, నాన్నల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించగలిగాను. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ లో సీటు సాధించాలని అనుకుంటున్నా. ఆర్టిఫిషియల్ ఇంజిలిజెన్స్ లో మంచి పట్టు సాధించాలనేది నా లక్ష్యం.  
- వెంకట్ కౌండిన్య, జేఈఈ మెయిన్ టాపర్