ఖమ్మంలో రూ.113 కోట్లతో శ్రీవారి ఆలయం... అల్లీపురంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి ..

ఖమ్మంలో రూ.113 కోట్లతో శ్రీవారి ఆలయం... అల్లీపురంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి ..
  • 20.4 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
  • రేపు శంకుస్థాపన
  • హాజరుకానున్న చినజీయర్​స్వామి, టీటీడీ చైర్మన్​బీఆర్ నాయుడు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. అల్లీపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన 20.4 ఎకరాల స్థలంలో రూ.113 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రేపు భూమి పూజ జరగనుంది. 

కార్యక్రమానికి త్రిదండి చినజీయర్​ స్వామితో పాటు టీటీడీ చైర్మన్​ బీఆర్​ నాయుడు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో ఏపీ సీఎం చంద్రబాబును ఒప్పించి టీటీడీ నిధులు కేటాయించేలా చూశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి తొలిసారిగా రెండు ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ ముందుకు రాగా,  సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఒకటి, ఖమ్మంలో మరొకటి నిర్మాణం జరుపుకోనున్నాయి. 

ఈ ఆలయాల నిర్మాణంతోపాటు ఆ తర్వాత నిర్వహణ కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే జరగనుంది. ఖమ్మంలో రూ.89 కోట్లతో ఆలయ నిర్మాణం జరగనుండగా, మిగిలిన నిధులతో 5 వేల మందితో కల్యాణం జరుపుకునే అవకాశం ఉండేలా కల్యాణ మండపం, వేద పాఠశాల కూడా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. 

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల..

అల్లీపురంలో శ్రీవారి ఆలయ భూమిపూజకు జరుగుతున్న ఏర్పాట్లను శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. భూమిపూజకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 

యాగశాలతో పాటు నవధాన్యాలు వేసే ప్రాంతంలో, ప్రసాద పంపిణీ ప్రదేశంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, భక్తులు క్యూ లైన్లలో వచ్చేలా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 30 వేల మందికి భోజన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మరోవైపు గత నాలుగైదు రోజులుగా ఆలయ నిర్మాణ భూమి పూజ ఏర్పాట్లను తుమ్మల యుగంధర్​ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.