దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న తాజా తమిళ చిత్రం ‘వెట్టువం’. ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ, కలైయరసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘వరల్డ్ ఆఫ్ వెట్టువం’ పేరుతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. తెలుగులోనూ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్‌కు రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘వెట్టువం’ కథ గతం, వర్తమానం, భవిష్యత్తు.. ఇలా మూడు కాలాల నేపథ్యంలో సాగనున్నట్టు ఈ వీడియో ద్వారా రివీల్ చేశారు.
భూమి, అధికారం, మనుగడ చుట్టూ కథలో ప్రధాన సంఘర్షణ కొనసాగనుంది. యాక్షన్‌తో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలను కూడా పా. రంజిత్ ఇందులో మిక్స్ చేశాడు. సినిమాలో సంప్రదాయ భారతీయ క్రీడ మల్లఖంబకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. అధికారాన్ని దక్కించుకునే క్రమంలో ఈ క్రీడను కథలో ముడిపెట్టినట్టు గ్లింప్స్ సూచిస్తోంది. ఆర్య, శోభిత, దినేష్ సహా ఇతర నటీనటులు మల్లఖంబతో పాటు స్వీయరక్షణలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్టు రానా ఈ వీడియోలో చెబుతాడు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు హైలైట్‌గా నిలిచింది. ఎస్ సాయి దేవానంద్, సాయి వెంకటేశ్వరన్‌తో కలిసి పా.రంజిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
