మళ్లీ తెరపైకి నేరెళ్ల ఘటన

మళ్లీ తెరపైకి నేరెళ్ల ఘటన
  • కవిత వ్యాఖ్యలతో పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేసిన బాధితులు 

రాజన్న సిరిసిల్ల,వెలుగు: గత బీఆర్ఎస్  ప్రభుత్వం హయాంలో 2017లో సంచలనం సృష్టించిన నేరెళ్ల ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ నేరెళ్ల బాధితులు కోల హరీశ్, పెంట బాణయ్య, పసుల ఈశ్వర్, బత్తుల మహేశ్, చెప్పాల రాజు, గంథం గోపాల్.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. అప్పుడున్న ఎస్పీ విశ్వజిత్  కంపాటి, సీసీఎస్ ఎస్ఐ రవీందర్  విచక్షణారహితంగా థర్డ్  డిగ్రీ ప్రయోగించి తమపై అక్రమ కేసులు పెట్టారని, కవిత చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. జోగినపల్లి సంతోష్​ రావు,ఆయన తండ్రి రవీందర్ రావు వల్లే నేరెళ్ల దళితులపై దాడులు చేశారని కవిత స్పష్టంగా చెప్పినందున థర్డ్  డిగ్రీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. 

2017లో అసలేం జరిగింది

రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు జలాశయంలో ముంపుకు గురయ్యే ప్రాంతంలో ఇసుకను తొలగించేందుకు మైనింగ్ శాఖ టెండర్లు నిర్వహించింది. తర్వాత చీర్లవంచ కొదురుపాక ప్రాంతాల్లోని ఇసు క రీచ్​ల ద్వారా రోజూ వందలాది లారీలు టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించేవారు. కొంతమంది డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలను నడపడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతుండేవి. 2017 జులైన 2న తంగళ్లపల్లి మండలం జిలెల్ల వద్ద నేరె ళ్లకు చెందిన బదనపురం భూమయ్య అనే రైతు మోపైడ్​పై వెళ్తుండగా ఇసుక లారీ ఢీ కొట్టడంతో అక్కడిక్కడే చనిపోయాడు. దాంతో నేరెళ్ల గ్రామస్తులు, అతని బంధువులు రాత్రి ఇసుక లారీని తగులబెట్టారు. పోలీసులు నేరెళ్ల గ్రామానికిచెందిన 8 మందిపై కేసు నమోదు చేశారు. 

వారిని అరెస్టు చేసి ఐదు రోజుల తర్వాత జులై 7న రిమాండ్ కు తరలించారు. 8 మందిపై ఉన్న గాయాలను చూసి కరీంనగర్  జైలర్  రిమాండ్ కు నిరాకరించారు. దీంతో బాధితులను పోలీసులు కరీంనగర్  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఇప్పటి కరీంనగర్  ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్.. నిందితులను కలిసి మాట్లాడారు. తర్వాత వారు మీడియాకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.