
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ కుటుంబ సభ్యులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బాధితులు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతున్న తమ వాళ్ళ ఆచూకీ చెప్పడం లేదని ఆందోళన చేస్తున్నారు బాధిత కుటుంబాలు. రోజు మొత్తంలో కేవలం గంటసేపు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించట్లేదని ఆరోపించారు. మా కుటుంబ సభ్యుల మృతదేహాలు అప్పగించకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్సూరెన్స్ కంపెనీల కోసం శిథిలాలను తొలగించడం లేదని బాధితుల ఆరోపించారు. గంట సేపు శిథిలాలు తొలగిస్తే ఈ రోజు మూడు మృతదేహాలు దొరికాయని.. శిథిలాల తొలగింపును కంపెనీ ఇన్సూరెన్స్ ప్రతినిధుల కోసం అడ్డు కుంటున్నారని ఆరోపించారు. ఇవాళ ఒక మృతదేహం బట్టలు కూడా చిరిగిపోకుండా దొరికిందని.. కంపెనీ వెంటనే స్పందించి ఉంటే బతికే ఉండేవారేమోనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, సంగారెడ్డి జిల్లా పాశ మైలారం సిగాచి ఫార్మా కంపెనీలో 2025, జూన్ 30న ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రియాక్టర్ పేలి దాదాపు 40 మంది వరకు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రియాక్టర్ పేలుడి ధాటికి కంపెనీ భవనం కుప్పకూలగా.. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
►ALSO READ | ఏడాదిలో నెల రోజులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేయండి : కార్పొరేట్ ఆస్పత్రి డాక్టర్లకు సీఎం రేవంత్ పిలుపు
ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. వర్షం కురుస్తుండటంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటన జరిగి మూడు రోజులు కావొస్తోన్న ఇప్పటి వరకు కొందరి ఆచూకీ దొరకలేదు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు కంపెనీ ముందు పడిగాపులు కాస్తున్నారు. ఘటన జరిగి మూడు రోజులు గడిచినప్పటికీ తమ వారి ఆచూకీ చెప్పకపోవడంతో ఓ వైపు బాధ.. మరోవైపు అసహనంతో బుధవారం (జూలై 2) ముందు ఆందోళనకు దిగారు.
తమ వారి ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రియాక్టర్ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సిగాచి కంపెనీ రూ.కోటి చొప్పున నష్టం పరిహారం ఇస్తామని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఘోర విషాదాల్లో ఒకటిగా నిల్చిన సిగాచి కంపెనీ పేలుడు ఘటన ఎన్నో కుటుంబాల్లో పూడ్చలేని విషాదాన్ని మిగిల్చింది.