- నా భర్తను కాపాడండి: బాధితురాలి వేడుకోలు
- మదీనగూడ ‘అర్చన’ ఆసుపత్రి వద్ద బంధువులతో కలిసి ఆందోళన
చందానగర్, వెలుగు: మంచిగున్న మనిషికి తప్పుడు ట్రీట్మెంట్లు చేసి, ప్రాణాల మీదకు తెచ్చారని హాస్పిటల్ ఎదుట బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ట్రీట్మెంట్ల పేరుతో రూ.15 లక్షల వరకు వసూలు చేసి, ఇప్పుడు కండీషన్ సీరియస్ అంటూ చేతులెత్తేస్తున్నారని వాపోయారు. బాధితుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం మనియార్‌పల్లి గ్రామానికి చెందిన సంతోష్ (32)కు ప్రైవేట్ పార్ట్ వద్ద చిన్న గడ్డ కావడంతో చందానగర్‌లోని చెన్నారెడ్డి ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నాడు.
రెండు రోజుల తర్వాత ఫాలోఅప్ చెకప్ కోసం వెళ్లగా, క్రియాటినిన్ తక్కువగా ఉందని మదీనగూడలోని అర్చన ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా అక్కడి డాక్టర్లు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఏప్రిల్ 14న సంతోష్‌ను అర్చన ఆసుపత్రిలో చేర్పించగా, డా. వెంకటేశ్వర్రావు కట్టా ఆధ్వర్యంలో అతనికి డయాలసిస్ చేశారు. ఆ తర్వాత హార్ట్ ఎఫెక్ట్ అయిందని, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిందంటూ రకరకాల ట్రీట్మెంట్ల పేరుతో ఇప్పటివరకు రూ.15 లక్షల బిల్లు కట్టించుకున్నారు.
తీరా ఇప్పుడు సంతోష్ పరిస్థితి విషమంగా ఉందని, రెండు రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచినట్లు చెబుతున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. మరింత డబ్బు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని పేషెంట్ భార్య రజిత కన్నీరుమున్నీరైంది. మంచిగా ఉన్న వ్యక్తిని తప్పుడు చికిత్సలతో సీరియస్ కండీషన్‌కు తెచ్చి, ఇప్పుడు చేతులెత్తేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని, తన భర్తను కాపాడాలని బంధువులతో కలిసి ఆమె మంగళవారం అర్చన ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగింది.
బాధితుల ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. పూర్ణిమ తన బృందంతో కలిసి మంగళవారం అర్చన ఆసుపత్రికి చేరుకుని ట్రీట్మెంట్, బిల్లుల రికార్డులపై ఆరా తీశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి సదరు ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
