జూబ్లీహిల్స్లో ఖాయమైన కాంగ్రెస్ గెలుపు !

జూబ్లీహిల్స్లో ఖాయమైన కాంగ్రెస్ గెలుపు !

‘ఇందిరమ్మ రాజ్యం’లో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం  ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు సామాజిక న్యాయం కూడా అందిస్తుండడంతో ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ లక్ష్యంగా రాష్ట్రం దూసుకుపోతోంది. ప్రజాదరణతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోనున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌  ఉప ఎన్నికను విజయవంతంగా ఎదుర్కోబోతోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్‌  ప్రజలు భారీ మెజార్టీతో పట్టం కట్టబోతున్నారని స్పష్టమవుతోంది. ప్రజా సమస్యలపై  పూర్తి అవగాహన ఉన్న కాంగ్రెస్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో  పలు సంక్షేమ పథకాలు ప్రకటించడమే కాకుండా, అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే వాటిని అమలు చేసింది.  తమది  ‘చేతల ప్రభుత్వం’ అని రేవంత్‌ రెడ్డి  సర్కార్‌  నిరూపించుకుంది.

ఆరు గ్యారెంటీల్లో భాగంగా ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది.  200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అమలు చేస్తోంది.  రూ.500 గ్యాస్‌ సబ్సిడీ అందిస్తోంది.  ఆరోగ్య శ్రీ పథకం రూ.10 లక్షలకు పెంచింది.  65 వేలకు ఉద్యోగ నియామకాలు చేపట్టింది.  మహిళలకు ‘ఇందిరమ్మ శక్తి పథకం’ కింద పెట్టుబడి సాయం చేస్తోంది. పేదలకు రేషన్‌ కార్డులు ఇవ్వడమే కాకుండా,  ఉచితంగా  సన్నబియ్యం  ఇస్తోంది.  ఇందిరమ్మ ఇండ్లతో  పేదలకు గూడు  కల్పించింది. అన్నదాతలకు  రుణమాఫీ చేయడమే కాకుండా, ‘రైతు భరోసా’ అమలుచేసింది. 

పీజేఆర్ చేసిన అభివృద్ధే ఉంది!
రాష్ట్రంలో  విజయవంతంగా కులగణన చేపట్టి యావత్‌ దేశానికి స్ఫూర్తిగా ఉండడమే కాకుండా.. విద్య, ఉపాధి,  స్థానికసంస్థల  ఎన్నికల్లో  బీసీ రిజర్వేషన్లను 42% కి పెంచి జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలిచింది.  దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించింది.  నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంతో కాంగ్రెస్‌ కు అవినాభావ సంబంధాలున్నాయి.  పునర్విభజనకు పూర్వం ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతాల్లో దివంగత కాంగ్రెస్‌ నేత  పి.జనార్దన్‌ రెడ్డి  చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ స్థానిక ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.  అదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్‌ ఓటర్లు 2009లో  గెలిపించారు. గతంలో పీజేఆర్‌,  వైఎస్‌ఆర్‌  నేతృత్వంలో కాంగ్రెస్‌  ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధే ఇక్కడ అడుగడుగునా కానరావడం పార్టీకి ఎంతో గర్వకారణం. 

బీఆర్ఎస్ పాలనలో కానరాని అభివృద్ధి 
2014 నుంచి బీఆర్‌ఎస్‌ పాలనలో స్థానికంగా ప్రత్యేకంగా చేపట్టిన అభివృద్ధి ఏమీ లేదు. 2014లో  టీడీపీ నుంచి గెలిచిన మాగంటి గోపినాథ్‌ అనంతరం బీఆర్‌ఎస్​లో చేరి 2018,  2023లో  కూడా గెలిచినా అభివృద్ధి జరగలేదు. 2023లో  కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పార్టీలకతీతంగా నియోజకవర్గంలో వేగవంతంగా పలు అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా జూబ్లీహిల్స్​లో  భారీగానే ఉన్నారు.  

జూబ్లీహిల్స్‌  ఉప ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయి.  బీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చిన ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, రేషన్‌ కార్డులు, దళిత బంధు, కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య వంటి పథకాలు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో  ఎంతమందికి అందాయో చర్చకు ఆ పార్టీ సిద్ధమా? 

బీఆర్ఎస్​, బీజేపీ తప్పుడు ప్రచారం
గ్రేటర్‌లో ట్యాంక్‌ బండ్‌ను మంచినీళ్ల చెరువుగా చెస్తామని చెప్పి మురికికూపంగా మార్చారు. హైదరాబాద్‌ను ‘ఇస్తాంబుల్‌’ చేస్తామని మాయమాటలు చెప్పారు. వర్షాలతో పురాతన  ఉస్మానియా ఆసుపత్రిలో నీరు చేరినా వారిచ్చిన కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం హామీగానే మిగిలిపోయింది.  ఇలా చెప్పుకుంటూపోతే రాష్ట్రానికే కాదు,  గ్రేటర్‌ నగరానికి కూడా పలు వాగ్దానాలు చేసి అమలుచేయని బీఆర్‌ఎస్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల సందర్భంగా మరోసారి అబద్ధాలతో ప్రజల వద్దకు వస్తోంది.  బీఆర్‌ఎస్‌ పార్టీకి తానేమీ తీసిపోనట్టుగా బీజేపీ కూడా జూబ్లీహిల్స్​లో తప్పుడు ప్రచారం చేస్తోంది. 

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ సెగ్మంట్‌ ఉన్న సికింద్రాబాద్‌  పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు బీజేపీ గెలుస్తున్నా ఆ పార్టీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి కృషి చేయలేదు.  సికింద్రాబాద్​ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ కిషన్‌ రెడ్డి..  నరేంద్ర మోదీ ప్రభుత్వంలో   కేంద్ర మంత్రిగా ఉన్నా జూబ్లీహిల్స్​కు చేసిందేమీ లేదు.

రాష్ట్రంలో,  జూబ్లీహిల్స్​లో 23 నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వం, పదకొండేళ్ల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని  సవాలు విసిరినా స్పందించని  బీజేపీ... మతతత్వ భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తోంది.  

తెలంగాణపై కేంద్రం వివక్ష
చారిత్రాత్మకమైన ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మాణం ప్రారంభమైంది.  గ్రేటర్‌లో ట్రాఫిక్‌ సమస్యలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నగరం నలువైపులా మెట్రో రైలు విస్తరణ పనులు చేపట్టింది.  కొత్తగా ఫ్లై ఓవర్లు నిర్మిస్తోంది.  మూసీ సుందరీకరణకు నడుం బిగించింది. కబ్జాకు గురైన చెరువులను పునర్నిర్మిస్తోంది.  పేదలకు మేలు చేకూరేలా ప్రభుత్వం ఆక్రమణలను తొలగిస్తుంటే,  ప్రతిపక్షాలు డబ్బున్నవారికి వత్తాసు పలుకుతూ ‘హైడ్రా’ను  విమర్శిస్తున్నారు.

మెట్రో రైలు, మూసీ సుందరీకరణకు సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తున్నది.   రాష్ట్ర బీజేపీ నేతలు స్వప్రయోజనాల కోసం నోరు మెదపడం లేదు.  కాంగ్రెస్‌  పార్టీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతుండడంతో  ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు దిక్కుతోచక ఒక్కటై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్న ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయి.  

సామాజిక న్యాయం
జూబ్లీహిల్స్​లో  సామాజిక న్యాయానికి పెద్దపీట  వేస్తూ  సామాజిక న్యాయంలో తమకెవరూ సాటిరారని  కాంగ్రెస్‌ మరోసారి నిరూపించుకుంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు అగ్రవర్ణాల అభ్యర్థులకు టికెట్‌ ఇవ్వగా, కాంగ్రెస్‌ బీసీ వర్గానికి చెందిన నవీన్‌ యాదవ్‌ ను బరిలోకి దింపింది. మరోవైపు  మైనార్టీ వర్గాలకు కూడా ప్రాధాన్యతిస్తూ ప్రముఖ క్రికెటర్‌  అజారుద్దీన్‌ కు మంత్రి పదవి కట్టబెట్టింది. క్రికెట్‌లో పలు రికార్డులు నెలకొల్పి దేశానికి గొప్ప పేరు తెచ్చిన అజారుద్దీన్‌ కు మంత్రి పదవి ఇస్తే అభినందించాల్సిందిపోయి బురద జల్లడం ప్రతిపక్షాలకే చెల్లింది. 

ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నపుడు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రజలు సంతృప్తిగా స్పందిస్తున్నారు.  అభివృద్ధి పనులు,  సంక్షేమ పథకాలు మరింత విజయవంతంగా అమలుచేసేలా కాంగ్రెస్‌ పార్టీని జూబ్లీహిల్స్‌ లో గెలిపిస్తే ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారానిక ఒడిగట్టినా, జూబ్లీ హిల్స్​ ఓటర్లు 11తేదీన కాంగ్రెస్​ పార్టీనే ఆశీర్వదించి గెలిపించబోతున్నారని  పూర్తి  విశ్వాసం ఉంది.

 బి.మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు