లడఖ్ : వచ్చింది పిల్లి అనుకొని.. కుక్కలు ఆగకుండా అరిచాయి. దానిచుట్టూ మూగేందుకు ప్రయత్నించాయి. అయితే అచ్చం పిల్లిలా ఉన్న ఆ జంతువు ధైర్యంగా అక్కడే కూర్చుంది. దీంతో కుక్కలన్నీ తోక ముడిచాయి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్ బుధవారం ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్రెడిట్ ను లడఖ్‌కు చెందిన గాయకురాలు షిరీన్ ఫాతిమాకు ఇచ్చారు. ఆమె పోస్ట్చేసిన వీడియోనే తాను డౌన్లోడ్ చేసుకొని రీపోస్ట్ చేశానని ఆయన తెలిపారు. ‘‘వీడియోలో కనిపిస్తున్న జంతువేదో చెప్పుకోండి చూద్దాం’’ అంటూ నెటిజన్లకు ఆయన సరదా ప్రశ్న వేశారు. దీంతో ఎంతోమంది తమకు తోచిన ఆన్సర్స్ ఇచ్చారు. కొన్ని గంటల్లోనే వేలాదిగా లైక్స్ వచ్చాయి. ఈ పోస్ట్ చేసిన 9 గంటల తర్వాత అది ఏ జంతువనే దానిపై క్లారిటీ ఇస్తూ పర్వీన్ ట్విట్టర్లో మరో పోస్ట్ చేశారు. వీడియోలో కనిపిస్తున్నది ‘హిమాలయన్ లింక్స్’గా పిలిచే అడవి పిల్లి అని వెల్లడించారు. పొడవాటి చెవులు, పిల్లి కంటే పెద్ద శరీరాకృతి దీని ప్రత్యేక లక్షణాలని తెలిపారు.
