
హైదరాబాద్, వెలుగు: ఆర్టీఏ, మైనింగ్ శాఖ అధికారులతో కలిసి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా రబీ సీజన్లకు సంబంధించిన (సీఆర్‌ఎమ్) ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రైస్ మిల్లులు, గోదాములపై మంగళవారం దాడులు చేసింది. ఆ వివరాలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ శిఖాగోయల్ బుధవారం వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా తాడికల్లోని రాజరాజేశ్వర పారా బాయిల్డ్ రైస్ మిల్లులో కరీంనగర్ యూనిట్ అధికారులు తనిఖీలు చేశారు. శంకరపట్నం మండలంలోని రైస్ మిల్లర్లు నిల్వ చేసిన 2022–23, 2023–24 రబీ సీజన్‌కు సంబంధించిన రూ.6.73 కోట్ల విలువ చేసే 31,234 క్వింటాళ్ల కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను సీజ్ చేసి మిల్లర్లుకు నోటీసులిచ్చారు.
మహబూబ్‌నగర్‌లో ఆర్టీఏ, మైనింగ్ శాఖ అధికారులతో కలిసి రాయకల్ టోల్ ప్లాజా, జడ్చర్ల నుంచి కోదాడ వెళ్లే రూట్‌లో తనిఖీలు చేశారు. ట్యాక్స్‌లు చెల్లించకపోవడంతోపాటు ఓవర్‌లోడ్‌తో గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న 12 వాహనాలను సీజ్ చేశారు. జనగామ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 25 వాహనాలను అడ్డగించి కేసులు నమోదు చేశారు.