బీఎస్ఎఫ్​ తొలిసారి విజయ్​ దివస్​ పరేడ్​

బీఎస్ఎఫ్​ తొలిసారి విజయ్​ దివస్​ పరేడ్​
  • అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

న్యూఢిల్లీ :  బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాల చరిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ బీఎస్ఎఫ్​ శనివారం తొలిసారిగా ‘విజయ్ దివస్ పరేడ్’ నిర్వహించింది. ఢిల్లీలోని చావ్లా క్యాంప్‌లో జరిగిన సెరిమోనియల్ పరేడ్‌కు బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ గౌరవ వందనం స్వీకరించి, అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. కాగా బీఎస్ఎఫ్​బలగాల స్థాయిలో పూర్తి ‘విజయ్ దివస్ పరేడ్’ నిర్వహించడం ఇదే మొదటిసారి.  విజయ్ దివస్ సందర్భంగా పోరాట యోధుల త్యాగాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్మరించుకున్నారు.‘‘1971 యుద్ధంలో మన సాయుధ బలగాలు చేసిన నిస్వార్థ త్యాగాన్ని దేశం కృతజ్ఞతతో స్మరించుకుంటున్నది. అసమాన ధైర్యాన్ని ప్రదర్శించి, చరిత్రాత్మక విజయాన్ని సాధించిన ధైర్యవంతులకు నేను నివాళులర్పిస్తున్నాను”అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు.

‘‘యుద్ధంలో సైనికుల పరాక్రమం, అంకితభావం దేశానికి గర్వకారణంగా నిలిచాయి. వారి త్యాగాలు, స్ఫూర్తి ప్రజల్లో హృదయాల్లో, దేశ చరిత్రలో చెరగని ముద్రలా నిలిచిపోతాయి. అమరవీరులందరికీ నివాళి అర్పిస్తున్నాను’’ అని ట్వీట్​చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా యుద్ధంలో సాయుధ దళాల ధైర్యం, పరాక్రమాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఆయన రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తో కలిసి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.