తమిళనాడు ఎన్నికల ఫలితాలపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దళపతి విజయ్ మొదటిసారిగా రాజకీయ పార్టీని స్థాపించి కొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో, అభిమానులు మరియు కార్యకర్తల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ క్రమంలో, విజయ్ ఓడిపోతాడనే భయంతో ఒక అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన కె. మహేంద్రన్ (28), టీవీకే పార్టీ నేత విజయ్‌కు వీరాభిమాని. విజయ్ ఎన్నికల్లో ఓడిపోతాడనే వదంతులు వ్యాపించడంతో, అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి కొద్దిసేపటి ముందే ఈ ఘటన జరిగినట్లు తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి.
పోలీసుల తెలిపిన ప్రకారం, మహేంద్రన్ తీవ్ర ఆందోళనకు గురై తన ఇంటి సమీపంలోనే తన గొంతును కోసుకున్నాడు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని రక్షించి కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. ప్రస్తుతం అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అభిమానం తలకెక్కితే..
అయితే, ఇది ముందుచూపు లేని పిచ్చి అభిమానం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, విజయ్ తన అసాధారణ శైలిలో ఓట్లను రాబడుతున్నాడు. దాదాపు 109+కి పైగా సీట్ల ముందంజలో దూసుకెళ్లడం చూడాల్సింది పోయి, ఓడిపోతాడనే భయంతో సూసైడ్ చేసుకోవడం పిచ్చి పని అంటున్నారు. అయినా, ఓ వ్యక్తి ఓడిపోయాడనో లేదా గెలిచాడనో ఇలా నిండు జీవితాన్ని నాశనం చేసుకోవడం తప్పని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
