హిందూ అమ్మాయిలను ట్రాప్‌ చేసే వాళ్లకు సీఎం వార్నింగ్

హిందూ అమ్మాయిలను ట్రాప్‌ చేసే వాళ్లకు సీఎం వార్నింగ్

గోవధ, లవ్ జీహాద్‌పై  గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసే వాళ్లపై కఠినమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అహ్మదాబాద్‌లోని వైష్ణోదేవి సర్కిల్‌లో నిన్న (శుక్రవారం) రైకా ఎడ్యుకేషన్ చారిటబుల్‌ ట్రస్ట్‌ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా గోవధకు పాల్పడే వాళ్లను శిక్షించేందుకు రాష్ట్రంలో తమ బీజేపీ సర్కారు కఠిన చట్టం తీసుకొచ్చిందని రూపానీ చెప్పారు. అలాగే హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసే వాళ్లను కఠినంగా శిక్షించేందుకు కూడా చట్టం తీసుకొచ్చామని గుర్తు చేశారు.

‘‘మా ప్రభుత్వం అనేక అంశాలపై కఠిన చట్టాలను చేసింది. భూ కబ్జాలకు చెక్‌ పెట్టేందుకు, గోవధను నిషేధిస్తూ, చెయిన్‌ స్నాచర్లను కఠినంగా శిక్షించేందుకు కూడా బలమైన చట్టాలను తెచ్చాం” అని రూపానీ అన్నారు. అలాగే లవ్‌ జీహాద్‌ను అడ్డుకునేందుకు కూడా చట్టం చేశామని, హిందూ అమ్మాయిలను ట్రాప్‌ చేసి లేపుకొని పోయే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ ఫ్రీడం ఆఫ్ రిలిజియన్ చట్ట సవరణ –2021ను ఏప్రిల్‌ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టం జూన్‌ 15 నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో బలవంతంగా జరిగే మత మార్పిడులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం తెచ్చామన్నారు.