చార్మినార్, వెలుగు: విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. ఆదివారం భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని బ్రాహ్మణ వీధిలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గ గుడికి కళాకారుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపుగా వెళ్లారు. కృష్ణానదిలో గంగతెప్పకు ప్రత్యేక పూజలు చేశారు.
బంగారు, వెండి బోనాలతో పాటు పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు బోనాల జాతర ఉత్సవాలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవాలయ పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, సభ్యులు హరికృష్ణ ప్రారంభించారు.
దుర్గగుడి వద్ద పాలక మండలి చైర్మన్, ఈవో ఊరేగింపునకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. భాగ్యనగర్ ఊరేగింపు కమిటీ చైర్మన్ మల్యాల మధుసూధన్ యాదవ్, మాజీ చైర్మన్లు గాజుల అంజయ్య, రాకేశ్ తివారి, జనగామ మధుసూదన్ గౌడ్, సీకే ఆనంద్‌రావు పాల్గొన్నారు.
