- రామయ్యను దర్శించుకున్న రచయిత విజయేంద్రప్రసాద్
భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు బుధవారం ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకొచ్చారు. ఆవు పాలు, నెయ్యి, పెరుగు, తేనె, పంచదారతో అభిషేకం చేశారు. అనంతరం సమస్త నదీ జలాలతో తిరుమంజనం చేసి విశేష హారతులు సమర్పించారు. కల్యాణమూర్తులకు నిత్యకల్యాణం చేశారు. భక్తులు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించారు.
ముందుగా విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం నివేదనతో క్రతువు ముగిసింది. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజభోగం నివేదించారు. సాయంత్రం దర్బార్ సేవ చేసి సీతారామయ్యకు దివిటీ సలాం సమర్పించారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఏఈవో శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో వేదాశీర్వచనం చేసి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.
