మ్యాజిక్ ఫిగర్‎కు దగ్గరగా ఆగుతున్న విజయ్ టీవీకే: కలిసొచ్చేది ఎవరు.. నిలబెట్టేది ఎవరనేది ఉత్కంఠ

మ్యాజిక్ ఫిగర్‎కు దగ్గరగా ఆగుతున్న విజయ్ టీవీకే: కలిసొచ్చేది ఎవరు.. నిలబెట్టేది ఎవరనేది ఉత్కంఠ

 విజయ్ టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్.. 118 సీట్లకు దగ్గరలో ఆగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా.. టీవీకే పార్టీ 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓవరాల్‎గా ఇప్పటి అంచనా ప్రకారం.. టీవీకే పార్టీ 100 నుంచి 110 స్థానాల దగ్గర ఆగొచ్చు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే మ్యాజిక్ ఫిగర్‎కు కావాల్సిన మరో 10 నుంచి 20 మంది మద్దతు ఎవరు ఇస్తారు అనేది ఆసక్తిగా మారింది. విజయ్ సీఎం కావాలంటే మద్దతిచ్చేది పార్టీనా లేక స్వతంత్రులా.. జాతీయ పార్టీలా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలోనే.. విజయ్ పార్టీ ఎవరి మద్దతు తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ ఎవరూ ఊహించని విధంగా టాప్ గేర్‏లో దూసుకుపోతుంది. ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం టీవీకే పార్టీ 108 స్థానాల్లో లీడింగ్‎లో కొనసాగుతూ తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. 

ప్రస్తుత ట్రెండ్స్ పరిశీలిస్తే టీవీకే  105 నుంచి 110 సీట్లు గెలిచే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇదే జరిగితే టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇతరుల మద్దతు అవసరం. కానీ డ్రవిడ భావజాల పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేతో చేతులు కలిపేదే లేదని ఎన్నికలకు ముందే విజయ్ ప్రకటించారు. 7 దశాబ్ధాలుగా పాతుకుపోయిన ద్రవిడ రాజకీయాలకు దూరంగా ఉంటానని విజయ్ స్పష్టం చేశాడు.

 సో.. ద్రవిడ పార్టీలతో విజయ్ చేతులు కలిపే అవకాశం లేదు. దీంతో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడనేది తమిళనాడుతో పాటు యావత్ దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో టీవీకే పార్టీ అధికారం చేపట్టాలంటే విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం.

కాంగ్రెస్‌, CPI, PMK మద్దతు కోరే అవకాశం

తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌, CPI, PMK పార్టీల మద్దతు కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం PMK 6, కాంగ్రెస్‌ 5, CPI 2 సీట్లలో లీడింగ్‌ లో ఉన్నాయి. పార్టీలు ఆయా స్థానాలను గెలిచి విజయ్‎కు మద్దతు ఇస్తే టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి లైన్ క్లియర్ అవుతోంది. 

విజయ్‎కి, కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. కరూర్ తొక్కిసలాట, సీబీఐ విచారణ వేళ విజయ్‎కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలబడ్డారు. సో, విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆలోచించకపోవచ్చంటున్నారు విశ్లేషకులు. 

కండిషన్స్‎తో అన్నాడీఎంకేతో పొత్తు..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ టీవీకే పార్టీ, అన్నాడీఎంకే మధ్య పొత్తుకు సంబంధించిన చర్చలు జరిగాయి. కానీ టీవీకే ఎక్కువ సీట్లు అడగటం, విజయ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేయడంతో ఈ పొత్తు కార్యరూపం దాల్చలేదు. విజయ్ బీజేపీ, డీఎంకే టార్గెట్‏గానే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రెండు పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. 

డీఎంకే టీవీకేకి రాజకీయ శత్రువు అయితే, బీజేపీ సైద్ధాంతిక శత్రువు అని విజయ్ తన వైఖరి స్పష్టం చేశారు. సో.. ఈ రెండు పార్టీలతో విజయ్ చేయి కలిపే చాన్సే లేదు. ఒకవేళ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలనుకున్న టీవీకే కొన్ని షరతులు విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ, అన్నాడీఎంకే కూటమిగా ఉన్నాయి.

 బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించిన నేపథ్యంలో ఆ కూటమితో తెగదెంపులు చేసుకోవాలని అన్నాడీఎంకేను కోరే అవకాశం ఉంది. అన్నాడీఎంకే ఇందుకు అంగీకరిస్తే టీవీకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎక్స్‎పర్ట్స్. మొత్తానికి తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందనే దానిపై సోమవారం (మే 4) సాయంత్రం వరకు ఒక క్లారిటీ రానుంది.