కూలీగా నటిస్తూ చోరీలు..వికారాబాద్ లో అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

కూలీగా నటిస్తూ చోరీలు..వికారాబాద్ లో అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు
  •     చోరీ సొమ్ముతో సేవా కార్యక్రమాలు

వికారాబాద్, వెలుగు: కూలీగా నటిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను వికారాబాద్​ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఎస్పీ స్నేహా మెహ్రా వెల్లడించారు. యూపీకి చెందిన వికాస్ సింగ్ అలియాస్ తేజా సింగ్ సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని పోచమ్మ బస్తీలో నివాసముంటున్నాడు. 

కూలీ పనులు చేస్తున్నట్లు నటిస్తూ రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో సంగారెడ్డి, సైబరాబాద్, మల్కాజ్‌‌గిరి తదితర ప్రాంతాల్లో చోరీలు చేశాడు. వికారాబాద్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని మణికంఠనగర్​లో మే1న తులంన్నర బంగారం, రూ.2.10 లక్షలు చోరీకి గురయ్యాడు. 

ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వికాస్​సింగ్​ను నిందితుడిగా గుర్తించి బుధవారం రాత్రి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద బంగారు ఆభరణాలు, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితుడు చోరీలు చేయగా వచ్చిన సొమ్ముతో తన స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు చేయడం గమనార్హం. నిందితుడిని చోరీలకు ప్రోత్సహించిన బంగారం షాపుల యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చెప్పారు.