- మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్ బాబు
తాండూరు/పరిగి/వికారాబాద్: వికారాబాద్ జిల్లాను రోడ్ల పరంగా అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 900 కోట్ల నిధులు మంజూరు చేసిందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రగతి సభల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
తాండూరులో రూ.290 కోట్లతో..
తాండూరులో ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డితో కలిసి రూ.290 కోట్లతో చేపట్టే హ్యామ్ రోడ్డు పనులను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులకు రూ.25 కోట్ల పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. తాండూరు కాగ్నా నదిలో మురుగునీరు కలవకుండా రూ.30 కోట్లు కేటాయించామని, రూ. 94 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను చేపడతామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొడంగల్ తర్వాత తాండూరుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడంతోపాటు, విద్యార్థులకు ఉదయం అల్పాహారం సౌకర్యం కల్పించామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు
పరిగిలో రూ.185 కోట్ల రోడ్డు పనుల శంకుస్థాపన సందర్భంగా మంత్రులు మంత్రులు మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, ప్రజల పక్షాన పోరాడకుండా మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గ్రూప్–-1 పరీక్ష నిర్వహించలేదని, ఒక్క అర్హుడికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, గ్యాస్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం చేశాడని, కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి వచ్చానని అనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. హరీశ్‌రావు ఒంటిపై పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టె దొరకలేదా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వికారాబాద్‌లో రూ.261 కోట్లతో..
వికారాబాద్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి రూ. 261 కోట్ల హ్యామ్ రోడ్డు పనులను మంత్రులు ప్రారంభించారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని స్పీకర్ తెలిపారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్ రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్ దీపక్ తివారీ, అధికారులు పాల్గొన్నారు.
