ఊరూరా కల్చరల్, హెరిటేజ్ లెక్కలు..జనవరి 26న పల్లెల్లో ప్రత్యేక గ్రామసభలు

ఊరూరా కల్చరల్, హెరిటేజ్ లెక్కలు..జనవరి 26న పల్లెల్లో  ప్రత్యేక గ్రామసభలు
  •     మన ఊరి చరిత్ర దేశమంతా తెలిసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ 
  •     పల్లెల్లో వివరాలు సేకరించాలని పంచాయతీ సెక్రటరీలకు ఆదేశాలు
  •     26న ప్రత్యేక  గ్రామసభల నిర్వహణ 
  •     సేకరించిన అంశాలు గ్రామసభలో ధ్రువీకరించాక
  •     ‘మేరా గావ్.. మేరీ ధరోహర్’ పోర్టల్​లో నమోదు 

హైదరాబాద్, వెలుగు: మన ఊరికి ఎంతో చరిత్ర ఉంటుంది. తాతల కాలం నాటి గుడులు, ఊరంతా కలిసి చేసుకునే జాతర ఉండొచ్చు. అయితే.. ఇన్నాళ్లూ ఈ విషయాలు మన ఊరికే పరిమితమయ్యాయి. ఇకపై మన ఊరి చరిత్ర, గొప్పతనం దేశంతోపాటు ప్రపంచానికి తెలిసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాయి. 

ఇందులో భాగంగా  రాష్ట్రవ్యాప్తంగా రిపబ్లిక్ డే రోజున పల్లెల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. అభివృద్ధి పనులతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై చర్చించేలా ప్రణాళిక రెడీ చేసింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేరా గావ్.. మేరీ ధరోహర్’ (నా గ్రామం.. నా వారసత్వం) కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోని సాంస్కృతిక విశేషాలను సేకరించాలని పీఆర్, ఆర్డీ డైరెక్టర్​ శ్రుతి ఓజా శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. 

కేంద్రం ఆదేశాల మేరకు పంచాయతీ సెక్రటరీలు, ఇతర సిబ్బంది గ్రామాల్లో ఫీల్డ్  సర్వే చేయాలని పేర్కొన్నారు. ఊర్లో ఉన్న పురాతన కట్టడాలు, గుళ్లు, గోపురాలు, జాతరలు, పండుగలు, ఫేమస్  వ్యక్తులు, కళాకారులు, వంటకాలు.. ఇలా అన్నింటినీ గుర్తించి ఫొటోలతో సహా మేరా గావ్- మేరీ ధరోహర్ (ఎంజీఎండీ)  కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్  చేయాలని సూచించారు. 

26న పల్లెల్లో  ప్రత్యేక గ్రామసభలు

నా గ్రామం.. నా వారసత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 26న పల్లెల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని అన్ని జిల్లాల డీపీఓలను పంచాయతీరాజ్​ శాఖ ఆదేశించింది. కార్యదర్శులు, ఇతర సిబ్బంది 26లోగా  గ్రామంలోని సంప్రదాయాలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, చారిత్రక ప్రాధాన్యం, కళారూపాలు, వారసత్వ ప్రదేశాలు, సంప్రదాయ ఆహారం, ప్రముఖ కళాకారులు, ఉత్సవాలు, పండుగలు, సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు, స్థానిక విశేషాలతోపాటు ఇతర సాంస్కృతిక అంశాలను సేకరించాలి.  

వీటిని 26న జరిగే గ్రామసభలో ప్రజల ముందు ఉంచాలి. ఈ వివరాలన్నీ కరెక్టేనా? ఏమైనా తప్పులు ఉన్నాయా? అనేది గ్రామస్తులతో చర్చించాలి. సేకరించిన అంశాలను  అక్కడికక్కడే ధ్రువీకరణ పూర్తిచేయాలి. తర్వాత ఫైనల్  డేటాను వెబ్​ పోర్టల్​లో ఎంట్రీ చేయాలని ఆఫీసర్లకు సూచించారు. 

సెక్రటరీలు సేకరించే అంశాలు ఇవే..

రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో కోటలు, గడీలు, గుళ్లు, మసీదులు, చర్చిలు, దర్గాలు, పురాతన బావులు, మండపాలు, శిలాశాసనాలు, ఊర్లో జరిగే జాతరలు, బోనాలు, బతుకమ్మ, పీర్ల పండుగలు, ఉర్సు ఉత్సవాలు, బుర్రకథ, ఒగ్గుకథ, యక్షగానం చెప్పేవారు,  చెక్కబొమ్మలు, కుండలు, ఇత్తడి పని చేసేవారు, నేతన్నలు,  స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, రచయితలు, ఆటగాళ్లు, కళాకారులు, ఊరి స్పెషల్ వంటకాలు, ఆభరణాలు, వాగులు, వంకలు, గుట్టలు, గ్రామ సంప్రదాయాలు, నమ్మకాలు, కట్టుబాట్లు, చారిత్రక ప్రాధాన్యం, కవులు, కళాకారులు, క్రీడాకారులు, సంప్రదాయ వృత్తులు, చేతివృత్తులు, స్థానిక విశేషాలు ఇలా ప్రతి అంశాన్ని సేకరించాలి. అయితే, గ్రామానికి సంబంధించిన ఫొటోలను ఇంటర్ నెట్  నుంచి డౌన్ లోడ్ చేసినవి పెట్టకూడదని పేర్కొంది.  

ఫీల్డ్​లో స్వయంగా తీసిన ఒరిజినల్  ఫొటోలు లేదా వీడియోలే అప్ లోడ్ చేయాలని, గ్రామ పెద్దలు, కళాకారులు స్థానికులతో మాట్లాడి సమాచారం ధ్రువీకరించుకోవాలని స్పష్టం చేసింది.  ఈ కార్యక్రమాన్ని బ్లాక్  లెవెల్  కమిటీల పర్యవేక్షణలో సక్సెస్  చేయాలని డీపీఓలను ఆదేశించింది.