భద్రాచలం, వెలుగు : తూరుబాక–-పర్ణశాల మధ్య రహదారికి రిపేర్లు చేయించాలని మండలంలోని పలు గ్రామాల ప్రజలు డిమాండ్చేశారు. దుమ్ముగూడెం మండలం తూరుబాక–-పర్ణశాల గ్రామాల మధ్య ఆర్అండ్బీ రహదారి ఇసుక లారీల వల్ల ధ్వంసమై ప్రమాదాలకు కారణం అవుతోందని, తక్షణమే ఈ రోడ్డుకు రిపేర్లు చేయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ములకపాడు క్రాస్రోడ్డుపై ప్రజలు భారీ ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సుమారు 5 గంటలపాటు గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్అయ్యింది.
ఇటీవల ఈ రహదారిపై మృతి చెందిన వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. ఆందోళనకారులతో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఫోన్లో మాట్లాడినా ససేమిరా అన్నారు. అనంతరం తహసీల్దార్ అశోక్కుమార్ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇసుక లారీలను నిలిపివేయాలని, రహదారి రిపేర్లు తక్షణమే చేయించాలని వారు డిమాండ్చేశారు. ప్యాచ్ వర్కులు చేపిస్తామని, లారీల టైమింగ్స్ మార్చుతామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
