పరిహారం కోసం బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితుల ఆందోళన

 పరిహారం కోసం  బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితుల ఆందోళన

యాదగిరిగుట్ట, వెలుగు: హామీ ఇచ్చి దాదాపు నాలుగు నెలలు దాటుతున్నా పట్టించుకోకపోవడంతో బస్వాపూర్ రిజర్వాయర్ లో ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా గ్రామస్తులు మళ్లీ నిరసన బాట పట్టారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం లప్పనాయక్ తండాకు చెందిన నిర్వాసితులు గురువారం రిజర్వాయర్ పనులను అడ్డుకుని కట్టపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణం కోసం లప్పనాయక్ తండా గ్రామంలో 650 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించిందన్నారు. కేవలం 443 ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించిందని, మిగతా 207 ఎకరాలకు సంబంధించిన పరిహారం చెల్లించకుండానే రిజర్వాయర్ పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒక్కో కుటుంబానికి రూ.7.6 లక్షల చొప్పున మొత్తం 280 కుటుంబాలకు చెల్లించాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ డబ్బులను కూడా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ముంపులో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు దాతర్ పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 294లో సుమారు 30 ఎకరాల భూమిని లేఅవుట్ గా మార్చి అందజేస్తామన్న అధికారులు ఇప్పటివరకు సంబంధిత భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయలేదని మండిపడ్డారు. గతంలో కూడా పరిహారం కోసం 13 రోజులపాటు దీక్షలు చేశామని, నవంబర్ 9న ఆఫీసర్లు వచ్చి సరిగ్గా నెల రోజుల్లో పరిహారానికి సంబంధించిన డబ్బులు అందజేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో దీక్షలు విరమించామని గుర్తుచేశారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో లప్పనాయక్ తండాతో పాటు భువనగిరి నియోజకవర్గానికి చెందిన తిమ్మాపూర్ గ్రామం కూడా ముంపునకు గురవుతుండడంతో తిమ్మాపూర్ నిర్వాసితులు ఆందోళనకు దిగారని, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వంతో పోరాడి పరిహారం ఇప్పించారని గుర్తుచేశారు. కానీ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాత్రం తమ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సునీత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్​చేశారు.