రెజ్లింగ్​ ఫైనల్​లో వినేశ్‌‌‌‌.. జావెలిన్‌‌‌‌ త్రోలో ఫైనల్‌‌‌‌కు నీరజ్ చోప్రా

రెజ్లింగ్​ ఫైనల్​లో వినేశ్‌‌‌‌.. జావెలిన్‌‌‌‌ త్రోలో ఫైనల్‌‌‌‌కు నీరజ్ చోప్రా
  •  రెజ్లింగ్‌‌‌‌లో ఫైనల్ చేరిన దేశ తొలి మహిళగా రికార్డు
  • తొలి రౌండ్‌‌‌‌లోనే టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌, డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌కు షాక్‌‌
  • క్వార్టర్స్‌‌‌‌, సెమీఫైనల్లోనూ గెలిచిన స్టార్ రెజ్లర్
  • నేడు అమెరికన్‌‌‌‌ సారా అన్‌‌‌‌తో టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌

ఏడాదిగా సరిగ్గా ప్రాక్టీస్ చేసింది లేదు. ఫామ్‌‌‌‌ అస్సలు లేదు. ఓ దశలో ఈ ఒలింపిక్స్‌‌‌‌కు అర్హత సాధిస్తుందో లేదో కూడా తెలియదు. పైగా, మెగా గేమ్స్‌‌‌‌ కోసం తన వెయిట్ కేటగిరీని మార్చుకుంది. అంచనాలే లేని ఆమె  ముందు తొలి రౌండ్‌‌‌‌లోనే టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌, 82 అంతర్జాతీయ మ్యాచ్‌‌‌‌ల్లో ఓటమి లేని ప్రత్యర్థి ఎదురైంది. కానీ, ఇవేవీ  ఇండియా రెజ్లింగ్ క్వీన్‌‌‌‌ వినేశ్ ఫొగాట్‌‌‌‌ జోరు అడ్డుకోలేకపోయాయి.

 ప్రపంచ నంబర్ వన్ ‌‌‌‌ను ఓడించడంతో మొదలైన ఆమె జోరు ఫైనల్ చేరిన ఇండియా తొలి మహిళా రెజ్లర్‌‌‌‌‌‌‌‌గా చరిత్ర సృష్టించే వరకూ సాగింది. రియో ఒలింపిక్స్‌‌‌‌ క్వార్టర్ ఫైనల్లో మోకాలు గాయంతో కన్నీటితో నిష్క్రమించిన వినేశ్‌‌‌‌.. దేశ మహిళా రెజ్లర్ల కోసం ఫెడరేషన్ పెద్దలకు వ్యతిరేకంగా గతేడాదంతా పోరాడి తన కెరీర్‌‌‌‌‌‌‌‌నే పణంగా పెట్టింది. కానీ, పట్టు విడవకుండా పారిస్‌‌‌‌కు వచ్చి విశ్వ క్రీడల్లో పతకం ఖాయం చేసుకుంది. ఈ రోజు జరిగే ఫైనల్లోనూ గెలిస్తే  ఒలింపిక్స్‌‌‌‌లో బంగారు పతకం నెగ్గిన దేశ తొలి మహిళగా స్వర్ణ చరిత్ర లిఖించనుంది. 

పారిస్‌ : ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌‌‌‌ పారిస్ ఒలింపిక్స్‌‌‌‌లో మ్యాజిక్‌‌‌‌ చేసింది. మేటి రెజ్లర్‌‌‌‌‌‌‌‌గా పేరున్నా.. ఫామ్ దృష్ట్యా ఈసారి పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వినేశ్‌‌‌‌..  టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ గోల్డ్ మెడలిస్ట్‌‌‌‌, నాలుగు సార్లు వరల్డ్ చాంపియన్‌‌‌‌ యుయి సుసాకితో పాటు  మరో ఇద్దరు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది.  విమెన్స్‌‌‌‌ 50 కేజీ పోటీల్లో మంగళవారం ఒక్కరోజే సెమీస్ సహా మూడు రౌండ్లలో అద్భుత ఆట చూపెట్టింది.

 సెమీఫైనల్లో వినేశ్‌‌‌‌ 5–0తో క్యూబా రెజ్లర్‌‌‌‌‌‌‌‌ గుజ్మన్‌‌‌‌ లోపేజ్‌‌‌‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌‌‌‌ చేరుకుంది. తొలుత హోరాహోరీగా సాగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో ఇండియా రెజ్లర్ 3–2తో యుయి సుసాకి (జపాన్‌‌‌‌)పై విజయం సాధించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో వినేశ్ 7–5తో 8వ సీడ్ మాజీ యూరోపియన్ చాంపియన్‌‌‌‌ ఒసాకా లివాచ్‌‌‌‌ (ఉక్రెయిన్‌‌‌‌) ను ఓడించి సెమీస్‌‌‌‌లో అడుగుపెట్టింది. బుధవారం జరిగే ఫైనల్లో వినేశ్‌‌‌‌.. టోక్యో కాంస్య పతక విజేతగా అమెరికాకు చెందిన సారా అన్‌‌‌‌ హిల్బెబ్రాండ్‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

అదే జోరు..

తొలి రౌండ్‌‌‌‌లోనే గోల్డ్ ఫేవరెట్‌‌‌‌ను ఓడించిన ఉత్సాహాన్ని వినేశ్‌‌‌‌ రోజంతా చూపెట్టింది.  క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌పై కాస్త కష్టపడిన తను సెమీస్‌‌‌‌లో ఒక్క పాయింట్ కూడా కోల్పోకుండా క్యూబా ప్రత్యర్థి లోపేజ్‌‌‌‌ చిత్తుగా ఓడించింది. సెమీస్ బౌట్‌‌‌‌ కూడా నిదానంగానే మొదలైంది. గత రెండు రౌండ్లతో పోలిస్తే ఈసారి వినేశ్‌‌‌‌ మొదటి నుంచి దూకుడు చూపెట్టినా లోపేజ్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌కు ప్రాధాన్యత ఇచ్చింది. 

రెండో నిమిషంలో ఆమెకు 30 సెకండ్ల టైమ్ ఔట్‌‌‌‌ ఇవ్వడంతో వినేశ్‌‌‌‌కు తొలి పాయింట్ లభించింది. ఆ తర్వాత ఇద్దరూ బలమైన డిఫెన్స్‌‌‌‌ చూపెట్టడంతో తొలి భాగాన్ని వినేశ్‌‌‌‌ 1–0తో ముగించింది. సెకండాఫ్‌‌‌‌ తొలి నిమిషంలోనే పాయింట్ తెచ్చుకోవాలంటూ రిఫరీ వినేశ్‌‌‌‌కు 30 సెకండ్ల టైమ్‌‌‌‌ ఇచ్చారు. అంతే ఇండియా రెజ్లర్‌‌‌‌‌‌‌‌ స్పీడు పెంచింది. క్యూబా రెజ్లర్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాలును పట్టుకొని కింద పడేసింది. 

వెంటనే మరో కాలును కూడా మడతపెట్టి ఫ్లిప్‌‌‌‌ చేసి రెండు పాయింట్లు అందుకుంది. వినేశ్ ఉడుంపట్టుతో లోపేజ్‌‌‌‌ విలవిల్లాడింది. ఇదే ఊపులో తనను మరోసారి కిందపడేసి ఇంకో రెండు పాయింట్లు రాబట్టింది. చివరి క్షణాల్లో ప్రత్యర్థికి ఎలాంటి చాన్స్‌‌‌‌ ఇవ్వకుండా సెమీస్ గెలిచిన ఫొగాట్‌‌‌‌ ఫైనల్లో అడుగుపెట్టింది. 

అప్పుడు ఆందోళన.. ఇప్పుడు అద్భుతం

ఒలింపిక్స్‌‌లో ఫైనల్‌‌ చేరిన వినేశ్ ఫొగాట్ నిజంగానే అద్భుతం చేసింది. ఎందుకంటే గతేడాది తోటి మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ డబ్ల్యూఎఫ్‌‌‌‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌‌‌‌కు వ్యతిరేకంగా వినేశ్  రోడ్లెక్కి నిరసనల్లో పాల్గొంది. బ్యారికేడ్లు, పోలీసు ఆంక్షల మధ్య ఢిల్లీ జంతర్‌‌‌‌‌‌‌‌మంతర్‌‌‌‌‌‌‌‌ రోడ్లపై నిద్రించిన వినేశ్‌‌ ప్రాక్టీస్‌‌‌‌ కోల్పోయి.. టోర్నీలకు దూరమైంది. ఓ రకంగా తన కెరీర్‌‌‌‌‌‌‌‌నే పణంగా పెట్టింది. 

ఈ ఆందోళన కారణంగా 2023 సీజన్‌‌‌‌లో వినేశ్‌‌‌‌ చాలా వరకు ట్రెయినింగ్‌‌‌‌లో కూడా పాల్గొనలేదు. పైగా ధర్నాలో  అతి చేస్తున్నారని, నేషనల్స్‌‌‌‌, సెలెక్షన్ ట్రయల్స్‌‌‌‌లో తమకు మినహాయింపు ఇవ్వనందుకే అతనిపై కక్ష గట్టారని విమర్శలు కూడా  ఎదుర్కొన్నది. అయినా వినేశ్‌‌‌‌ మానసికంగా కుంగిపోలేదు. తన కలను నిజం చేసుకునేందుకు 53 కేజీల నుంచి 50 కేజీ విభాగానికి మారింది. పారిస్‌‌‌‌లో కఠిన డ్రా ఎదురైనా తొలి రౌండ్‌‌‌‌లోనే గోల్డ్ ఫేవరెట్‌‌‌‌ను ఓడించిన ఫొగాట్‌‌‌‌ అదే జోరుతో ఫైనల్ కూడా చేరి పతకం ఖాయం చేసుకుంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. మనో నిబ్బరం కోల్పోకుండా..  పట్టు వదలకుండా  పోరాడితే ముందుకెళ్తే విజయం సొంతం అవుతుందని నిరూపించింది. 

చివరి తొమ్మిది సెకండ్లలో మ్యాజిక్‌

అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన వినేశ్ తన తొలి బౌట్‌‌‌‌తోనే వరల్డ్ రెజ్లింగ్ దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. టోక్యో గోల్డ్ మెడలిస్ట్‌‌‌‌, నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్‌‌‌‌ ఎదురుగా ఉన్నా ఇండియా రెజ్లర్ అస్సలు కంగారుపడలేదు. పక్కా వ్యూహంతో వచ్చిన తను దాన్ని పకడ్బందీగా అమలు చేసింది. ఈ బౌట్‌‌‌‌లో ఇద్దరు రెజ్లర్లు ఒకరి బలాన్ని మరొకరు అంచనా వేసే ప్రయత్నం చేశారు. 

దాంతో మొదటి 90 సెకండ్ల వరకు ఎలాంటి  రెజ్లింగ్‌‌‌‌ జరగలేదు. పోటీ ప్రయత్నం లేకపోవడంతో పాసివిటీ  కింద  వినేశ్‌‌‌‌కు రిఫరీ వార్నింగ్ ఇచ్చి 30 సెకండ్లలో టైమ్‌‌‌‌లైన్ ఇవ్వడంతో తను తొలి పాయింట్ కోల్పోయింది. పెద్దగా పోటీ లేకుండా తొలి పీరియడ్ ముగియగా.. రెండోది కూడా దాదాపు అలానే సాగింది. ఇటు వినేశ్‌‌‌‌, అటు సుసాకి ఎటాక్‌‌‌‌ చేయలేకపోయారు. ఈ క్రమంలో పాసివిటీ కింద వినేశ్ మరో పాయింట్ కోల్పోయి 0–2 వెనకబడింది. బౌట్‌‌‌‌లో మరో 20 సెకండ్లు మాత్రమే మిగిలున్న సమయంలో ఇద్దరు రెజ్లర్లు యాక్షన్‌‌‌‌లోకి వచ్చారు. 

వినేశ్‌‌‌‌ ప్రత్యర్థి ఎడమ కాలును పట్టుకోవాలని చూసినా స్టాండింగ్ పొజిషన్‌‌‌‌ నుంచి అది సాధ్యం కాలేదు. కానీ, ఆటలో మరో 9 సెకండ్లు మాత్రమే మిగిలుండగా వినేశ్‌‌‌‌ ఒక్కసారిగా విజృంభించింది.  అటు ఇటు కదులుతున్న సుసాకి తన పాదాలను మ్యాట్‌‌‌‌పై గట్టిగా ఉంచడంలేదన్న విషయాన్ని పసిగట్టి ఒక్క ఉదుటున ఆమెను మ్యాట్‌‌‌‌పై పడేసింది. సుసాకి ఏం జరిగిందో తెలుసుకునేలోపే  మూడు పాయింట్లు రాబట్టి బౌట్ గెలిచి శుభారంభం చేసింది.