పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడి తీవ్ర నిరాశలో ఉన్న భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌ను రాజ్యసభకు నామినేట్ చేయాలని హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్ సింగ్ హుడా అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉంటే, ఆమె పేరును ప్రతిపాదించేదని ఆయన అన్నారు.
ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడిన ఆయన.. "త్వరలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. మాకు సరైన మెజారిటీ లేదు, లేకపోతే నేను ఆమెను నామినేట్ చేసేవాడిని. ఆమె మనందరినీ గర్వపడేలా చేసింది.." అని వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎంపీ అయిన ఆయన కుమారుడు దీపేందర్ హుడా సైతం అదే విషయాన్ని ప్రస్తావించారు. ఆయన దిగువ సభకు ఎన్నికైన తర్వాత హర్యానా నుంచి రాజ్యసభకు ఒక స్థానం ఖాళీగా ఉందని చెప్పారు. ఆ స్థానానికి వినేశ్ ఫోగాట్‌ను నామినేట్ చేయాలని సూచించారు.
"ఆమె ఓడిపోలేదు, గెలిచింది. ప్రజల హృదయాలను గెలుచుకుంది. యువతకు స్ఫూర్తిగా నిలిచింది.." అని దీపేందర్ హుడా అన్నారు.
పొలిటికల్ స్టంట్
అయితే, కాంగ్రెస్ నేతల ప్రకటనలను వినేశ్ ఫోగాట్ మామ మహావీర్ ఫోగాట్ "పొలిటికల్ స్టంట్"గా అభివర్ణించారు. గతంలో హర్యానాలో హుడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన కుమార్తె, రెజ్లర్ గీతా ఫోగాట్‌ను ఎందుకు రాజ్యసభకు పంపలేదని ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.