
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో తన అనర్హతపై ఇండియా రెజ్లర్ వినేశ్ ఫోగట్ చేసిన అప్పీల్‌ను తిరస్కరించిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్) బరువు- పరిమితిలో ఉంచుకోవడం అథ్లెట్ బాధ్యతేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎవ్వరికీ ఎటువంటి ఉపశమనం కల్పించలేమని సోమవారం విడుదల చేసిన 24 పేజీల వివరణాత్మక తీర్పులో తెలిపింది.
‘వినేశ్ తన ఇష్ట ప్రకారమే 50 కేజీ కేటగిరీలో పోటీ పడింది. ఇందులో 50 కేజీల కంటే తక్కువ బరువుతోనే పోటీ పడాలని ఆమెకు తెలుసు. గతంలో ఇలాంటి నిబంధనలకు లోబడి పలు పోటీల్లో పాల్గొన్న అనుభవం ఆమెకు ఉంది. కాబట్టి దీనికి విరుద్ధంగా కానీ, పోటీలో తన బరువు నియంత్రించుకోవాల్సిన అవసరాలను ఆమె అర్థం చేసుకోలేదని అనడానికి కానీ ఎలాంటి ఆధారాలు లేవు’ అని కాస్ పేర్కొంది. ఫైనల్ చేరినందుకు తన రజతం ఇవ్వాలన్న వినేశ్ అభ్యర్థననూకాస్ కొట్టివేసింది.
ఫొగాట్‌కు 16 కోట్ల నగదా.. అంతా అబద్దం: భర్త
వినేశ్ ఫొగాట్‌కు రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలు, సంస్థల నుంచి రూ. 16.35 కోట్ల నగదు బహుమతులు అందాయని వస్తున్న వార్తలను ఆమె భర్త సోమ్‌వీర్ రతీ ఖండించాడు. అవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేశాడు. వినేశ్‌కు ఎవ్వరి నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని కోరాడు.