
ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ‘‘ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఏంటి.. ఫిట్ గా ఉన్నాడు.. యంగ్ ప్లేయర్స్ కంటే యాక్టివ్ గా ఉంటాడు.. మరిన్ని రోజులు ఆడాల్సింది’’ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. 2025 మే నెలలో ఆల్ ఆఫ్ సెడన్ గా రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లీ.. కానీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడో ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ మొత్తానికి రిటైర్మెంట్ పై ఇన్నాళ్లకు నోరు విప్పాడు కోహ్లీ.
యువరాజ్ సింగ్ తన YouWeCan ఫౌండేషన్ కోసం నిర్వహించిన గాలా డిన్నర్ వేదికగా కోళ్లీ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు. మంగళవారం (జులై 08) ఏర్పాటు చేసిన ఈ డిన్నర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేమస్ క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు, సీనియర్లు హాజరయ్యారు. ఫ్యాన్స్ నుంచి ఎప్పట్నుంచో వస్తున్న ప్రశ్నలకు ఈ వేదికగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్న కోహ్లీ.. ఎట్టకేలకు తన సైలెన్స్ ను బ్రేక్ చేశాడు.
‘‘ రెండు రోజుల క్రితం గెడ్డానికి రంగు వేసుకున్నాను. ప్రతీ నాలుగు రోజులకు ఒకసారి గెడ్డానికి రంగు వేసుకుంటున్నామంటే.. టైం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి’’ అని పరోక్షంగా రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైందని గుర్తించినట్లు చెప్పాడు కోహ్లీ. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
2011లో వెస్టిండీస్ టూర్ లో ఇండియా 269వ టెస్టు ప్లేయర్‌గా ఈ ఫార్మాట్‌లోఅరంగేట్రం చేసిన విరాట్ 14 ఏండ్ల కెరీర్‌లో పరుగుల మోత మోగించడంతో పాటు తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. కెప్టెన్‌గా టీమిండియాను జట్టును టెస్టు ర్యాంకింగ్‌లో నంబర్ వన్ స్థానానికి చేర్చాడు. 2018-–19లో ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని సాధించాడు. అతని నాయకత్వంలో ఇండియా 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. 42 నెలల పాటు ఇండియాను టెస్టుల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిపాడు. దాంతో టెస్టులో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియా కెప్టెన్‌గా మారాడు.
ఓవరాల్‌గా గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్ వా తర్వాత నాలుగో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు. ఇండియా కెప్టెన్‌గా అత్యధికంగా 20 సెంచరీలు కొట్టి మరో రికార్డు సృష్టించాడు. తన నాయకత్వంలో స్వదేశంలో ఆడిన 11 సిరీస్‌ల్లో 11 గెలవడం విశేషం. అయితే, గత నాలుగేండ్ల నుంచి తను క్రమంగా ఫామ్ కోల్పోయాడు. సౌతాఫ్రికాలో సిరీస్ ఓటమి తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
36 ఏండ్ల కోహ్లీ ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ‘టెస్ట్ క్రికెట్‌లో తొలిసారి బ్యాగీ బ్లూ (ఇండియా క్యాప్) పెట్టుకొని14 ఏండ్లు గడిచాయి.
వన్డే, టీ20 ఫార్మాట్లలో కోహ్లీ అన్ని ఐసీసీ ట్రోఫీలను అందుకున్నాడు. వన్డే, టీ20 వరల్డ్ కప్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ కూడా అందుకున్నాడు. కానీ, తనకెంతో ఇష్టమైన టెస్టుల్లో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్ అందుకోకపోవడం తన కెరీర్‌లో లోటు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా వరుసగా రెండు సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడినా ట్రోఫీని ముద్దాడలేకపోయాడు.