టీమిండియాకు బిగ్ షాక్.. తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం

టీమిండియాకు బిగ్ షాక్.. తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం

స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఐదు టెస్టులు ఆడేందుకు సిద్ధమైన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల జట్టు నుంచి కోహ్లీ తన పేరును ఉపసంహరించుకున్నట్లు బీసీసీఐ సోమవారం (జనవరి 22) ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వలన కోహ్లీ మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.  

దీంతో కోహ్లీ లేకుండానే భారత్ తొలి రెండు టెస్టులు ఆడనుంది. హైదరాబాద్ వేదికగా జనవరి 25 న తొలి టెస్ట్, విశాఖ పట్నంలో ఫిబ్రవరి 2 న రెండో టెస్ట్ జరనున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్టర్లు, టీం మేనేజ్‌మెంట్ తో విరాట్ మాట్లాడాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ కోహ్లీ మొదట ప్రాధాన్యమని.. కొన్ని వ్యక్తిగత పరిస్థితుల వలన తప్పుకోవాల్సి వచ్చిందని బోర్డు తెలియజేసింది. 

కోహ్లీ పర్సనల్ రీజన్స్ వలన తప్పుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత విరాట్ స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఇక తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తో తొలి టీ20 సమయంలో తన కూతురు వామిక పుట్టిన రోజు సందర్భంగా కోహ్లీ ఈ మ్యాచ్ ఆడలేదు. కోహ్లీ వైదొలగడంతో ఆ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో ఆసక్తికరంగా మారింది. దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న సీనియర్ ప్లేయర్, నయావాల్ పుజారాకు స్థానం దక్కుతుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.