విశాక ఇండస్ట్రీస్‌‌ లాభం రూ. 23 కోట్లు

విశాక ఇండస్ట్రీస్‌‌ లాభం రూ. 23 కోట్లు
  •  షేరుకి రూ. 5  ఇంటెరిమ్‌‌ డివిడెండ్‌‌
  • ఏప్రిల్‌-డిసెంబర్‌‌లో రూ.79.77 కోట్ల లాభం

హైదరాబాద్‌‌, వెలుగు: బిల్డింగ్ మెటీరియల్స్‌‌ను తయారు చేసే విశాక ఇండస్ట్రీస్‌‌కు డిసెంబర్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో రూ. 23.04 కోట్ల నికర లాభం వచ్చింది. ఇది  కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌‌‌‌లో వచ్చిన లాభం రూ. 6.15 కోట్లు కంటే 275 శాతం ఎక్కువ.  పన్నులకు ముందు లాభం(పీబీటీ) రూ. 31.13 కోట్లుగా ఉంది. ఇది 2019–20 క్యూ3 లో రూ. 8.52 కోట్లుగా నమోదయ్యింది. విశాక ఇండస్ట్రీస్‌‌ క్యూ3 రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 16 శాతం పెరిగి రూ. 282.87 కోట్లుగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో కంపెనీకి రూ. 798.23 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇదే టైమ్‌‌లో కంపెనీకి రూ. 107.19 కోట్ల పీబీటీ రాగా, రూ. 79.77 కోట్ల నికర లాభం వచ్చింది.

బిల్డింగ్‌‌ ప్రొడక్ట్స్‌‌ బిజినెస్ బాగుంది..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో అత్యధిక లాభాన్ని ప్రకటించామని విశాక ఇండస్ట్రీస్ పేర్కొంది. బిల్డింగ్ ప్రొడక్ట్స్‌‌ బిజినెస్‌‌ మంచి గ్రోత్‌‌ను నమోదు చేసిందని, కంపెనీ క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉండడానికి ఈ సెగ్మెంటే కారణమని తెలిపింది. క్యూ3 లో కంపెనీ బిల్డింగ్ ప్రొడక్ట్స్‌‌ సెగ్మెంట్‌‌ రూ. 235.78 కోట్ల రెవెన్యూని నమోదు చేసింది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌‌‌‌లో కంపెనీకి ఈ సెగ్మెంట్‌‌ నుంచి రూ. 188.49 కోట్ల రెవెన్యూ వచ్చింది.  కరోనా వలన ఏర్పడిన సమస్యలను అధిగమించడంపై దృష్టి పెట్టామని కంపెనీ జాయింట్​ మేనేజింగ్​ డైరెక్టర్​ జీ వంశీక్రిష్ణ అన్నారు. రూరల్‌‌ మార్కెట్‌‌ మెరుగ్గా ఉండడం, అర్బన్‌‌ మార్కెట్ కూడా తిరిగి సాధారణ స్థాయికి వస్తుండడం, సప్లయ్‌‌ చెయిన్‌‌ మెరుగు పడడంతో మంచి పెర్ఫార్మెన్స్‌‌ను నమోదు చేయడం కష్టం కాదని చెప్పారు. క్యూ3 రిజల్ట్స్‌‌ బాగుండడంతో షేరుహోల్డర్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకి రూ. 5 ఇంటెరిమ్‌‌ డివిడెండ్‌‌ను ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. రికార్డ్‌ డేట్‌‌ను ఫిబ్రవరి 9 గా బోర్డ్ నిర్ణయించింది.