పునీత్ సేవా కార్యక్రమాల్లో ఒక బాధ్యతను నేను తీసుకుంటా

పునీత్ సేవా కార్యక్రమాల్లో ఒక బాధ్యతను నేను తీసుకుంటా

హైదరాబాద్: దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చేసిన సేవా కార్యక్రమాలను తాను ముందుకు తీసుకెళ్తానని హీరో విశాల్ అన్నారు. పునీత్ చదివిస్తున్న 1,800 మంది పిల్లల బాధ్యతను తీసుకుంటానని విశాల్ హామీ ఇచ్చారు. ఆర్యతో కలసి తాను నటించిన ‘ఎనిమీ’ మూవీ ప్రీ రిలిజ్ వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పునీత్ మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని.. ఇది కన్నడతోపాటు దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. 

‘ఇవ్వాళ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలా లేదా అని చివరి వరకు ఆలోచించాం. ఎందుకంటే ఒక మంచి నటుడు, మిత్రుడు, మంచి మనిషి మన మధ్య లేరు. పునీత్ లేడనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరణం మూవీ ఇండస్ట్రీతోపాటు సమాజానికి, ఆయన కుటుంబానికి, ఫ్యాన్స్‌కు తీరని లోటు. పునీత్‌‌లా ఒద్దికగా, నిరాడంబరంగా ఉండే మనిషిని చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చూడలేదు. ఆయన మేకప్ వేసుకున్నా తీసేసినా ఒకేలా ఉండేవారు. ఒక మనిషి ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలరంటే నమ్మలేం. 1,800 మంది విద్యార్థులను ఆయన చదివిస్తున్నారు. అనాథాశ్రమాలు నడిపారు, ఉచితంగా ఎందరికో ఎన్నో ఇచ్చారు. చనిపోయిన తర్వాత కూడా తన కళ్లను దానం చేశారు. పునీత్ సేవా కార్యక్రమాల్లో నేనూ భాగమవుతా. ఓ మిత్రుడిగా పునీత్ చదివిస్తున్న పిల్లల బాధ్యతలను వచ్చే ఏడాది నేను చూసుకుంటా. ఆ పిల్లలను నేను చదివిస్తా. వారిని నేను నడిపిస్తా’ అని విశాల్ చెప్పారు. ఇకపోతే.. విశాల్, ఆర్య కలసి నటించిన ఎనిమీ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్లలోకి రానుంది.  

మరిన్ని వార్తల కోసం: 

ఇండియా సెమీస్‌‌ చేరాలంటే ఇన్ని అద్భుతాలు జరగాలి

మా సర్కారును గుర్తించకుంటే ముప్పు మీకే

అబ్బాయిల్లో మూడ్ స్వింగ్స్​