ఇండియా సెమీస్‌‌ చేరాలంటే ఇన్ని అద్భుతాలు జరగాలి

ఇండియా సెమీస్‌‌ చేరాలంటే ఇన్ని అద్భుతాలు జరగాలి

ఇక కష్టమే!

ఎంత చెత్త బ్యాటింగ్ అది..! వరల్డ్‌‌ క్లాస్‌‌ బ్యాటర్లంతా కలిసి చేసింది 110 పరుగులే. 6  నుంచి 17 ఓవర్ల మధ్య వరుసగా 71 బాల్స్‌‌లో ఒక్కటంటే ఒక్క బౌండ్రీ కూడా రాలేదంటే కివీస్‌‌ బౌలర్లు ఎంత అద్భుతంగా బౌలింగ్‌‌ చేశారో.. మనోళ్లు ఎంత చెత్తగా బ్యాటింగ్‌‌ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఎంత పేలవ బౌలింగ్‌‌ అది..!  మన బ్యాటర్లు సింగిల్స్‌‌కే ఇబ్బంది పడ్డ పిచ్‌‌పై కివీస్‌‌ చెలరేగింది. ఇండియా ఇచ్చిన టార్గెట్‌‌ను రెండే వికెట్లు కోల్పోయి మరో 33  బాల్స్‌‌ మిగిలుండగానే ఛేజ్‌‌ చేసిందంటే మన బౌలింగ్‌‌ ఎంత పేలవంగా ఉందో చెప్పొచ్చు..!

మొత్తానికి వారం కిందట పాకిస్తాన్‌‌ చేతిలో చావుదెబ్బ నుంచి పాఠాలు నేర్చుకోని కోహ్లీసేన మరోసారి ఆల్‌‌రౌండ్‌‌ ఫ్లాప్‌‌ షో చేసింది. టీమ్‌‌ సెలక్షన్‌‌ నుంచి షాట్‌‌ సెలక్షన్‌‌ వరకు అన్నింటా ఫెయిలై.. న్యూజిలాండ్‌‌ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది..! టీ20 వరల్డ్‌‌కప్‌‌లో రెండో ఓటమితో కోహ్లీసేన సెమీస్‌‌ అవకాశాలు సన్నగిల్లాయి..! హ్యాట్రిక్‌‌ విక్టరీలతో గ్రూప్‌‌2 టాపర్‌‌ పాకిస్తాన్‌‌ సెమీస్‌‌ బెర్తు దాదాపు ఖాయం చేసుకోగా.. పాయింట్ల ఖాతానే తెరువని ఇండియా (-1.61 రన్​రేట్​) ఐదో ప్లేస్‌‌లో ఉంది. మిగిలిన మ్యాచ్​ల్లో చిన్న జట్లు అఫ్గానిస్తాన్‌‌, స్కాట్లాండ్‌‌, నమీబియాపై గెలిచినా మనోళ్లు  సెమీస్‌‌ చేరడం కష్టమే! ఎందుకంటే ఈ మూడు టీమ్స్‌‌తోనే తలపడనున్న న్యూజిలాండ్‌‌ రెండింటిలో ఓడాలి. అది అసాధ్యమే అనొచ్చు.! ఒక మ్యాచ్‌‌లో ఓడినా ప్లస్‌‌ రన్‌‌రేట్‌‌ (0.75)తో  కివీసే ముందంజ వేసే చాన్సుంది! కాబట్టి ఇండియా సెమీస్‌‌ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే..! లేదంటే ఈ ఓటమితోనే వరల్డ్‌‌కప్‌‌లో మన ఖేల్‌‌ ఖతమైనట్టే..!  టీ20 కెప్టెన్సీకి ఘనంగా వీడ్కోలు పలకాలని ఆశించిన కోహ్లీ కల చెదిరినట్టే..!

దుబాయ్‌‌: సెమీఫైనల్‌‌ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌‌లో టీమిండియా చేతులెత్తేసింది. పక్కా ప్లాన్‌‌తో పర్‌‌ఫెక్ట్‌‌ బౌలింగ్‌‌తో, కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌‌తో, ఖతర్నాక్​ బ్యాటింగ్‌‌తో ఇండియాను ఓడించిన న్యూజిలాండ్ సెమీస్‌‌ దిశగా ముందంజ వేసింది. ఆదివారం జరిగిన గ్రూప్‌‌–బి పోరులో కివీస్‌‌ 8  వికెట్ల తేడాతో ఇండియాను చిత్తు చేసింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 110/7 స్కోరు మాత్రమే చేసింది. జడేజా (19 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 26 నాటౌట్‌‌), హార్దిక్‌‌ పాండ్యా (24 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌తో 23) టాప్‌‌ స్కోరర్లు. ఇషాన్‌‌ కిషన్‌‌ (4), విరాట్‌‌ కోహ్లీ (9) ఫెయిలవగా..  లోకేశ్‌‌ రాహుల్‌‌ (18), రోహిత్‌‌ శర్మ (14), రిషబ్‌‌ పంత్‌‌ (12) ఆకట్టుకోలేకపోయారు. కివీస్‌‌ బౌలర్లలో ట్రెంట్‌‌ బౌల్ట్​ (3/20), ఇష్‌‌ సోధీ (2/17) ఇండియాను దెబ్బకొట్టారు. తర్వాత డారిల్‌‌ మిచెల్‌‌ (35 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49), కేన్‌‌ విలియమ్సన్‌‌ (33 నాటౌట్‌‌) మెరుపులతో న్యూజిలాండ్‌‌ 14.3  ఓవర్లోనే   111/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.  ఇష్‌‌ సోధీకి ప్లేయర్‌‌ ఆఫ్‌‌  ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 

పోరాటమే లేదు

కివీస్‌‌ సూపర్‌‌ బౌలింగ్ దెబ్బకు తొలుత బ్యాటింగ్‌‌లో కోహ్లీసేన పూర్తిగా ఫెయిలైంది. సింగిల్స్‌‌ తీసేందుకే బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అసలిది ఇండియానేనా అన్న అనుమానం కలిగిలేలా సాగింది మనోళ్ల ఆట. టాస్‌‌ కోల్పోవడంతోనే డీలా పడ్డ  జట్టు ఏ దశలోనూ తన స్థాయికి తగ్గట్టు ఆడలేక చిన్న స్కోరుకే పరిమితమైంది. వెన్నునొప్పికి గురైన సూర్యకుమార్‌‌ ప్లేస్‌‌లో తీసుకున్న ఇషాన్‌‌ కిషన్‌‌ అనూహ్యంగా కేఎల్‌‌ రాహుల్‌‌తో కలిసి ఓపెనర్‌‌గా వచ్చాడు. ఈ లెఫ్ట్‌‌–రైట్‌‌ కాంబినేషన్‌‌ మంచి ఆరంభం ఇస్తుందని ఆశిస్తే.. తీవ్రంగా నిరాశ పరించింది. గోల్డెన్‌‌ చాన్స్‌‌ను ఉపయోగించుకోలేకపోయిన ఇషాన్‌‌ మూడో ఓవర్లోనే తన ముంబై టీమ్‌‌మేట్‌‌ ట్రెంట్‌‌ బౌల్ట్​కు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. ఆ తర్వాతి బాల్‌‌కే రోహిత్‌‌ డకౌటవ్వాల్సింది. బౌల్ట్‌‌ వేసిన షార్ట్‌‌ బాల్‌‌కు తనిచ్చిన సింపుల్‌‌ క్యాచ్‌‌ను మిల్నే డ్రాప్‌‌ చేయడంతో బతికి పోయాడు. మిల్నే వేసిన ఐదో ఓవర్లో రాహుల్‌‌ ఓ బౌండ్రీతో కాస్త  వేగం పెంచగా.. రోహిత్‌‌ వరుసగా 4,6తో జోరు చూపాడు. సౌథీ బౌలింగ్‌‌లో రాహుల్‌‌ ఇంకో ఫోర్‌‌ కొట్టడంతో ఇద్దరూ ట్రాక్‌‌లో పడ్డట్టే అనిపించింది. కానీ, టిమ్​ సౌథీ (1/26)  ఆఫ్‌‌ స్టంప్‌‌పై వేసిన ఊరించే షార్ట్‌‌ బాల్‌‌ను పుల్‌‌ చేసిన రాహుల్‌‌ డీప్‌‌ స్క్వేర్‌‌లెగ్‌‌లో డారిల్‌‌కు ఈజీ క్యాచ్‌‌ ఇచ్చాడు. దాంతో, పవర్‌‌ప్లేలో ఇండియా 35/2 స్కోరుతో నిలిచి డిఫెన్స్‌‌లో పడింది. పవర్‌‌ప్లే తర్వాత కివీస్‌‌ బౌలర్లు మరింత జోరు పెంచారు. స్పిన్నర్లు శాంట్నర్‌‌ (0/15), ఇష్‌‌ సోధీతో పాటు మిల్నే (1/30) కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఇండియాపై ఒత్తిడి కొనసాగించారు. సోధీ వేసిన ఎనిమిదో ఓవర్లో పుల్‌‌ షాట్‌‌ ఆడబోయిన రోహిత్‌‌... బౌండ్రీలైన్‌‌ దగ్గర గప్టిల్‌‌కు చిక్కాడు. ఈ దశలో కోహ్లీ, రిషబ్‌‌ పంత్‌‌ ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. బ్లాక్‌‌క్యాప్స్‌‌ బౌలర్లు వాళ్లకు ఎలాంటి చాన్స్‌‌ ఇవ్వలేదు. ఇద్దరూ సింగిల్స్‌‌కే కష్టపడగా సగం ఓవర్లకు 48 రన్సే వచ్చాయి. 17 బాల్స్‌‌లో 9 రన్సే చేసిన కోహ్లీ వేగం పెంచేందుకు సోధీ బౌలింగ్‌‌లో షాట్‌‌ ఆడాడు. కానీ, అది సరిగ్గా కనెక్ట్‌‌ అవ్వక లాంగాన్‌‌లో బౌల్ట్‌‌ చేతిలో పడింది. పంత్‌‌కు తోడైన హార్దిక్‌‌ ఒక్కో పరుగుతో ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. కానీ, పంత్‌‌ను మిల్నే క్లీన్‌‌బౌల్డ్‌‌ చేయడంతో 15 ఓవర్లకు కోహ్లీసేన 73/5తో నిలిచింది. క్రీజులో ఉన్న హార్దిక్‌‌కు మరో ఆల్‌‌రౌండర్‌‌ జడేజా తోడయ్యాడు. బౌల్ట్‌‌, మిల్నే ఓవర్లో ఇద్దరూ చెరో ఫోర్‌‌  రాబట్టి ఇన్నింగ్స్‌‌లో చలనం తెచ్చారు. కానీ, 19వ ఓవర్లో హార్దిక్‌‌తో పాటు శార్దూల్‌‌ (0)ను ఔట్‌‌ చేసిన బౌల్ట్‌‌ టీ20ల్లో 50 వికెట్ల క్లబ్‌‌లో చేరాడు. అయితే, అదే ఓవర్లో ఫోర్‌‌తో పాటు లాస్ట్‌‌ ఓవర్లో సిక్స్‌‌ సహా 11 రన్స్‌‌ రాబట్టిన జడేజా స్కోరు వంద దాటించాడు.  

కివీస్‌ అలవోకగా

చిన్న టార్గెట్‌ను కివీస్‌ ఈజీగానే ఛేజ్‌ చేసింది. ఇండియన్స్‌ బ్యాట్లెత్తేసిన అదే వికెట్‌పై బ్లాక్‌క్యాప్స్‌ బ్యాటర్లు ఆకట్టుకున్నారు. ఇండియా బౌలర్లు తేలిపోయారు. బుమ్రా (2/19) ఒక్కడే కాస్త ప్రతిఘటించాడు.  మిగతా బౌలర్లతో పాటు  లాంగ్‌బ్రేక్‌ తర్వాత రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన హార్దిక్‌ పాండ్యా (0/17) ఆకట్టుకోలేకపోయాడు.  ఫస్ట్‌ రెండు ఓవర్లలో ఐదు రన్సే వచ్చినా వరుణ్‌ చక్రవర్తి  (0/23) వేసిన మూడో ఓవర్లో 4, 4తో టచ్‌లోకి వచ్చిన ఓపెనర్‌ గప్టిల్‌ (20).. బుమ్రా బౌలింగ్‌లో ఇంకో ఫోర్‌ కొట్టాడు. కానీ, మరో షాట్‌ ఆడే ప్రయత్నంలో తను శార్దూల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కానీ, ఈ ఆనందం ఇండియాకు ఎంతోసేపు నిలువలేదు. జడేజా (0/23) వేసిన ఆరో ఓవర్లో  మరో ఓపెనర్‌ డారిల్‌ మిచెల్ 6, 4, 4తో రెచ్చిపోవడంతో పవర్‌ ప్లేలో కివీస్‌ 44/1తో నిలిచింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేయగా.. డారిల్‌ స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. షమీ (0/11) ఓవర్లో సిక్స్‌, శార్దూల్‌ (0/17) బౌలింగ్‌లో 6, 4, 4తో బాదడంతో సగం ఓవర్లకే 83 రన్స్ వచ్చాయి. విజయానికి 15 రన్స్‌ అవసరమైన టైమ్‌లో బుమ్రా బౌలింగ్‌లో డారిల్‌ ఔటైనా..  కాన్వే (2 నాటౌట్‌)తో కలిసి విలియమ్సన్‌ న్యూజిలాండ్​  గెలుపు లాంఛనం పూర్తి చేశాడు. 

 

ఇండియా : రాహుల్‌‌ (సి) మిచెల్‌‌ (బి) సౌథీ 18, ఇషాన్‌‌ కిషన్‌‌ (సి) మిచెల్‌‌ (బి) బౌల్ట్‌‌  4, రోహిత్‌‌ (సి) గప్టిల్‌‌ (బి) సోధీ14, కోహ్లీ (సి) బౌల్ట్‌‌ (బి) సోదీ 9, పంత్‌‌ (బి) మిల్నే 12, పాండ్యా( సి) గప్టిల్‌‌ (బి) బౌల్ట్‌‌ 23, జడేజా (నాటౌట్‌‌) 26, ఠాకూర్‌‌ (సి) గప్టిల్‌‌ (బి) బౌల్ట్‌‌ 0, షమీ (నాటౌట్‌‌) 0 ; ఎక్స్‌‌ట్రాలు: 4 : మొత్తం 20 ఓవర్లలో 110/7 : వికెట్ల పతనం: 1–11, 2–35, 3–40, 4–48, 5–70, 6–94, 7–94 : బౌలింగ్‌‌: బౌల్ట్‌‌ 4–0–20–3, సౌథీ 4–0–26–1, శాంట్నర్‌‌ 4–0–15–0, మిల్నే 4–0–30–1, సోధీ 4–0–17–2 

న్యూజిలాండ్‌‌: గప్టిల్‌‌ (సి) ఠాకూర్‌‌ (బి) బుమ్రా 20, మిచెల్‌‌ (సి) రాహుల్‌‌ (బి) బుమ్రా 49, విలియమ్సన్‌‌ (నాటౌట్‌‌) 33, కాన్వే(నాటౌట్‌‌) 2 ; ఎక్స్‌‌ట్రాలు:7; మొత్తం: 14.3 ఓవర్లలో 111/2 ; వికెట్ల పతనం: 1–24, 2–96 ; బౌలింగ్‌‌: వరుణ్‌‌ 4–0–23–0, బుమ్రా 4–0–19–2, జడేజా 2–0–23–0, షమీ 1–0–11–0, ఠాకూర్‌‌ 1.3–0–17–0, పాండ్యా 2–0–17–0.