కేబుల్ బ్రిడ్జి పై రేపట్నుంచి సందర్శకులకు అనుమతి

కేబుల్ బ్రిడ్జి పై రేపట్నుంచి సందర్శకులకు అనుమతి

హైదరాబాద్: అట్టహాసంగా ప్రారంభమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై రేపట్నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలసి మంత్రి కేటీఆర్, తలసాని, శ్రీనివాసగౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కలసి ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి రోజు ప్రారంభ కార్యక్రమం.. ప్రొటోకాల్.. కోవిడ్ నిబంధనల దృష్ట్యా సందర్శకులను అనుమతించలేదు. రేపు శనివారం నుండి అనుమతివ్వాలని నిర్ణయించారు. ప్రజలకు అంకితం చేస్తున్న ఈ కార్యక్రమం అహ్లాదంగా సాగేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.  సాయంత్రం 5.30 గంటలకు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో సింఫోనీ బ్యాండ్ ఏర్పాటు చేశారు. ఈ లైవ్ బ్యాండ్ ప్రదర్శనకు ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ పిలుపునిచ్చారు. నార్తన్ బార్డర్ లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు , జి.హెచ్.యం.సి శానిటేషన్ కరోనా వారియర్ల సేవలకు సంఘీభావంగా బ్యాండ్ ప్రదర్శన ఉంటుంది. 45 నిమిషాల పాటు ప్రదర్శన జరుగుతుంది. “వందేమాతరం” తో ప్రారంభించి పలు దేశ భక్తి, భారతీయ , పాశ్చాత్య గీతాలు, సంగీతాన్ని ప్రదర్శించి “జయ హో ” తో ముగింపు కార్యక్రమాలకు ముగింపు పలుకుతామని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.