కేసీఆర్​ను గద్దె దించాల్సిందే: వివేక్​ వెంకటస్వామి

కేసీఆర్​ను గద్దె దించాల్సిందే:  వివేక్​ వెంకటస్వామి

గాంధీ సంకల్పయాత్రలో వివేక్​ వెంకటస్వామి

సీఎం కేసీఆర్​ మెడలు వంచాల్సిన సమయం ఆసన్నమైందని, ఆయనను సీఎం పదవి నుంచి దింపేవరకు నిద్రపోవద్దని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరంకుశ, అవినీతి పాలన నడుస్తోందని.. కమీషన్ల కోసమే కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ అంటున్నారని ఆరోపించారు. గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా రెండో రోజు ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివేక్​ మాట్లాడారు. అనేక మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్​ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

దోచుకునేందుకే ప్రైవేటు రూట్..

సమస్యల పరిష్కారం కోసం నెల రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్​ మాత్రం వాళ్లను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వివేక్​ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల హక్కులను హరించడమే కాకుండా, వారు ఆత్మహత్యలకు పాల్పడేలా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్​పరం చేసి రూ.60 వేల కోట్ల విలువైన భూములను అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్మికులు దసరా, దీపావళి పండగలకు దూరమై, తిండికి కూడా కష్టమైన పరిస్థితిలో వాళ్ల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి.. డెడ్​లైన్లు, గడువులు పెట్టడం ఏమిటని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ప్రజలపై అదనపు భారం పడుతుందని చెప్పారు.

జనాన్ని మభ్యపెడుతున్నరు

రాష్ట్రంలో వివిధ పథకాలు అమలు చేస్తున్నట్టుగా టీఆర్ఎస్​ సర్కారు ప్రజలను మభ్యపెడుతోందని వివేక్​ చెప్పారు. డబుల్​ బెడ్రూం ఇండ్లు అన్నారని, మూడెకరాల భూమి ఇస్తామన్నారని అవి ఎవరికీ అందలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలనే ఇక్కడా అమలు చేస్తూ జనాన్ని మోసం చేస్తున్నారన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు దేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిందని తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తనని చెప్పిన కేసీఆర్.. కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.