హైదరాబాద్ కా పహెచాన్.. హైదరాబాద్ కా పహిల్వాన్.. కుస్తీ పోటీలకు పూర్వ వైభవం రావాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ కా పహెచాన్.. హైదరాబాద్ కా పహిల్వాన్.. కుస్తీ పోటీలకు పూర్వ వైభవం రావాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

సైఫాబాద్, వెలుగు: గతంలో ‘హైదరాబాద్ కా పహెచాన్​..హైదరాబాద్ కా పహిల్వాన్’ అనే నానుడి ఉండేదని, అలాంటిది వారికి సరైన అవకాశాలు రాక ప్రతిభ కనబరచలేక పోతున్నారని కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. కుస్తీ పోటీలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మాజీ ఎంపీ , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్​కృషి చేస్తున్నారని కొనియాడారు. 

ఇటీవల ఎల్బీ స్టేడియంలో అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కేసరి–2026 పోటీల్లో గెలుపొందిన విజేతలను ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ అంటేనే పహిల్వాన్ల అడ్డా..అంజన్ కుమార్ యాదవ్ కూడా ఓ పహిల్వానే. 

జిమ్​లో ఆయన ఎక్సర్​సైజ్​లు చేసేవారు.. మా నాన్న దివంగత వెంకటస్వామి కూడా జిమ్​కు వెళ్లేవారు’ అని గుర్తు చేసుకున్నారు. పోటీల్లో గెలుపొందిన వారు మరింత శిక్షణ తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో రెజ్లర్లుగా రాణించాలని ఆకాంక్షించారు.