మా లెక్కలన్నీ పక్కా .. మా సంస్థల్లో ఎక్కడా అక్రమాల్లేవు: వివేక్ వెంకటస్వామి

మా లెక్కలన్నీ పక్కా ..  మా సంస్థల్లో ఎక్కడా అక్రమాల్లేవు: వివేక్ వెంకటస్వామి
  • కాళేశ్వరం, మిషన్​ భగీరథలో అవినీతిని  పట్టించుకోకుండా మాకు నోటీసులా? ​
  • రాజకీయ కక్షతోనే తమపై కేసులని ఫైర్​

హైదరాబాద్‌‌, వెలుగు:  విశాక ఇండస్ట్రీస్ సహా తమ సంస్థలకు చెందిన లెక్కలు అన్నీ పక్కాగా ఉంటాయని, ఎలాంటి అక్రమాలకు తావుండదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. రాజకీయ కక్షలో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమపై కేసు పెట్టాయని ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) విచారణకు వివేక్ గురువారం హాజరయ్యారు. 

తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో వేల కోట్ల అవినీతి జరిగిందని, వాళ్లపై ఈడీ రెయిడ్స్ ఎందుకు జరగలేదని బీజేపీని ప్రశ్నించారు. బీజేపీలో ఉన్నప్పుడు తనపై రెయిడ్స్ జరగలేదని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరిన తర్వాతే జరిగాయని మండిపడ్డారు. తాము నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నామని చెప్పారు. తమ -బ్యాంక్‌‌‌‌‌‌‌‌ లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని తెలిపారు. 

చట్టానికి వ్యతిరేకంగా తాము ఏమీ చేయలేదని, ఎంత ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ సహా అన్ని పన్నులను గడువులోగా చెల్లిస్తామని, తమ సంస్థల ద్వారా ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.10 వేల కోట్లను ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ రూపంలో కట్టామని వివేక్ వెల్లడించారు. రాష్ట్రంలో నిబద్ధతతో వ్యాపారం చేసే సంస్థల్లో విశాక ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ ముందు వరుసలో ఉందని చెప్పారు.