ఆత్మకూరులో వీఆర్ఏ మృతి

ఆత్మకూరులో వీఆర్ఏ మృతి

ఆత్మకూరు, వెలుగు: నెలరోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో బాధతో వీఆర్ఏ గుండె ఆగింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామానికి చెందిన బొజ్జ వీరయ్య(56) 20 ఏండ్లుగా వీఆర్ఏగా పని చేస్తున్నాడు. పే స్కేల్, అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలనే పలు డిమాండ్లతో వీఆర్ఏలు నిర్వహిస్తున్న సమ్మెలో చురుకుగా పాల్గొంటున్నాడు. శుక్రవారం ఆత్మకూరులో దీక్షలో పాల్గొన్న సమయంలో సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ పడుకునే నిరసన కొనసాగించాడు. శనివారం సైతం దీక్షలో పాల్గొన్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే చనిపోయాడు. వీఆర్ఏ నాయకులు డెడ్ బాడీతో జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీఆర్ఏల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీరయ్య భార్య వనమ్మ మూడు నెలల క్రితం గుండె పోటుతో, పెద్దకొడుకు రజినీ నెల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. చిన్న కొడుకు మహేశ్​ఉన్నాడు. మూడు నెలల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోయారంటూ మహేశ్​రోదించడం అందరినీ కలచివేసింది.

వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు నెరవెర్చాలె

ఖైరతాబాద్: సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్  చెప్పారు. శనివారం నాంపల్లిలోని అసెంబ్లీ ముందున్న గన్ పార్కులో జేఏసీ నాయకులతో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని, 55 సంవత్సరాలు దాటినవారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ 9 సెప్టెంబర్​2020 న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, రెండేండ్లు కావస్తున్నా ఇంతవరకు స్పందన లేదన్నారు. ఇప్పటికైనా స్పందించకుంటే వీఆర్ఏలతో కలిసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.