ఇక 50 శాతం రిజర్వేషన్లే లక్ష్యం : రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

ఇక 50 శాతం రిజర్వేషన్లే లక్ష్యం : రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
  • బీసీలకు ప్రత్యేక శాఖ ఉండాలి: దత్తాత్రేయ
  • 42 శాతం రిజర్వేషన్లపై ఏకగ్రీవ తీర్మానం మంచి పరిణామం: నారాయణ

బషీర్​బాగ్, వెలుగు: స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధించిన స్ఫూర్తితోనే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇదే చివరి పోరాటమని, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీసుకువచ్చిన బిల్లును ఎవరైనా వ్యతిరేకిస్తే సహించేది లేదని, వారిని రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు. 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్  గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్  అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ‘బీసీల యుద్ధభేరి’ సభలో కృష్ణయ్య మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరూ కోర్టుకు వెళ్లరాదని, ఏవరైనా వెళితే పోరాడి విజయం సాధిస్తామన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాస్టల్స్, గురుకుల రెసిడెన్షియల్  పాఠశాలల్లో స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్  పథకాలు సాధించామని, ఈ పధకాలను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆయన డిమాండ్  చేశారు. 

ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి మాట్లాడుతూ దోపిడి, అన్యాయం, అణచివేతకు గురైన బీసీలు రాజ్యాధికారం సాధించాలన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉండి బీసీలకే ఓట్లు వేయాలని సూచించారు. 56 శాతం ఉన్న బీసీలు రాజ్యాధికారంలో లేకపోవడం దారుణమన్నారు. మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు సాధించాలని పిలుపునిచ్చారు. ఇందుకు తమ మద్దతు ఉంటుందన్నారు. బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఉండాలన్నారు. 

జస్టిస్  సుదర్శన్ రెడ్డిని చంపుతారేమో: నారాయణ

సీపీఐ నేత కె.నారాయణ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఏకగ్రీవ తీర్మానం చేయడం మంచి పరిణామమన్నారు. మాజీ సీఎం కేసీఆర్  అసెంబ్లీకి వచ్చి మద్దతు ఇస్తే బాగుండేదన్నారు. తక్షణమే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఇక జస్టిస్  సుదర్శన్ రెడ్డిని నక్సలైట్  సానుభూతిపరుడని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంటున్నారని, ఆపరేషన్  కగార్  పేరుతో ఆయనను చంపుతారేమో అనే అనుమానం కలుగుతోందన్నారు.