కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వొచ్చు

కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వొచ్చు

ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది

హైకోర్టు ఫుల్‌‌ బెంచ్‌‌ కీలక తీర్పు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ విధానంలో పనిచేసే స్టాఫ్‌‌‌‌కు పర్మినెంట్‌‌‌‌ ఉద్యోగాల భర్తీ సమయంలో 20 శాతం వెయిటేజ్‌‌‌‌ మార్కులు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు ఫుల్‌‌‌‌ బెంచ్‌‌‌‌ కీలక తీర్పు చెప్పింది. సర్కార్‌‌‌‌ దవాఖానాల్లో స్టాఫ్‌‌‌‌ నర్సు, ల్యాబ్‌‌‌‌ టెక్నీషియన్లు, ట్రాన్స్‌‌‌‌కో, జెన్‌‌‌‌కో, డిస్కమ్‌‌‌‌ల్లో ఔట్‌‌‌‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌‌‌‌ విధానంలో పనిచేసే వారికి రెగ్యులర్‌‌‌‌ పోస్టుల భర్తీలో వెయిటేజీ మార్కులు ఇవ్వడాన్ని సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌ ఎ.రాజశేఖర్‌‌‌‌రెడ్డి, జస్టిస్‌‌‌‌ పి.నవీన్‌‌‌‌రావ్‌‌‌‌లతో కూడిన బెంచ్ 86 పేజీల తీర్పు చెప్పింది. ‘‘వెయిటేజీ మార్కులు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇదే సమయంలో తమకు వెయిటేజీ ఇవ్వాలనే హక్కు కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌కు ఉండదు. ఒక ఉద్యోగి పనిచేసే కాలానికే సర్వీస్‌‌‌‌ను పరిమితం చేసే అధికారం ఆయా శాఖలకు ఉంటుంది. వెయిటేజీ మార్కులు 20 శాతానికి మించకూడదు” అని స్పష్టం చేసింది.

గతంలో రెండు రకాల తీర్పులు..

ట్రాన్స్‌‌‌‌కో, జెన్‌‌‌‌కో, ఎన్‌‌‌‌పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌‌‌‌ల్లో లైన్‌‌‌‌మెన్, జూనియర్‌‌‌‌ లైన్‌‌‌‌మెన్, సబ్‌‌‌‌ ఇంజనీర్స్‌‌‌‌ తదితర పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల్లో ఔట్‌‌‌‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌‌‌‌ ఉద్యోగుల ఆరు నెలల సర్వీస్‌‌‌‌కు రెండున్నర మార్కులు చొప్పున గరిష్టంగా 45 మార్కుల్ని వెయిటేజీగా ఇవ్వాలని విద్యుత్‌‌‌‌ సంస్థలు నిర్ణయించాయి. దీనిపై ఓపెన్‌‌‌‌ కేటగిరీ అభ్యర్థులు సవాల్‌‌‌‌ చేసిన కేసుల్లో.. ఏడాదికి 2 మార్కులు చొప్పన గరిష్టంగా 20 మార్కులు వెయిటేజీ ఇవ్వాలని 2010లో సింగిల్‌‌‌‌ జడ్జి తీర్పు చెప్పారు. దీనిపై అప్పీళ్లను విచారించిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌.. ఆరు నెలలకు ఒక మార్కు చొప్పున గరిష్టంగా 20 మార్కులు వెయిటేజీ ఇవ్వాలని 2014లో తీర్పు చెప్పింది. దీన్ని సమీక్షించాలని ఎస్పీడీసీఎల్‌‌‌‌ వేసిన పిటిషన్‌‌‌‌ను డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారించింది. రూల్స్‌‌‌‌కు లోబడి భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎస్పీడీసీఎల్‌‌‌‌.. సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. మరోవైపు అగ్రికల్చర్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో వెయిటేజ్‌‌‌‌ మార్కులు ఇచ్చే పద్ధతిని ప్రభుత్వం ఎత్తేయడాన్ని మరో డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ సమర్థిస్తూ 2017లో తీర్పు చెప్పింది. ‘‘కాంట్రాక్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌కు వెయిటేజ్‌‌‌‌ మార్కుల రూల్‌‌‌‌ను సవరించే అధికారం రాష్ట్రానికి ఉంది. ఓపెన్‌‌‌‌ కేటగిరీ, కాంట్రాక్ట్‌‌‌‌/ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ అభ్యర్థులకు సమానంగా మార్కులు వస్తే కాంట్రాక్ట్‌‌‌‌/ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ అభ్యర్థులకే ప్రాధాన్యత ఇవ్వాలి” అని చెప్పింది.